ఆముదం ప్రయోజనాలు, ఉపయోగాలు, మరియు దుష్ప్రభావాలు – Castor Oil Benefits, Uses, And Side Effects In Telugu

Written by Dinesh
Last Updated on

ఆముదం అందరికీ తెలిసిందే! ఆముదం చెట్టు గింజల నుంచి తీసే తైలం భారత దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. వాతరోగాలను పోగొట్టడంలో దీనిది అగ్రస్థానం. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో దీని పాత్ర అమోఘం. ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదం వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు, చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది.

ఆముదంలో జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం ఉం. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి నూనె. చర్మాన్ని తెల్లబరచడం ద్వారా సహజ సిద్ధంగా అందాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఉపయోగపడే ఆముదం యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం!

ఆముదం యొక్క అనేక లాభాలు – Amazing Benefits of Castor Oil in Telugu

ఆముదం వాడటం వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆముదంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొత్త ఆరోగ్యకరమైన చర్మ కణాలను, కాంతివంతమైన చర్మాన్ని వృద్ధి చేస్తాయి. అంతేకాక, అకాల చర్మసంబంధమైన ముడతలను నివారించడానికి సహాయం చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు యొక్క ప్రభావం చర్మంపై పడకుండా ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.

1. చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది

ఆముదాన్ని చర్మాన్ని తెల్లగా మార్చేందుకు వాడే కొన్ని విధానాలు:

(i) ఆముదం-పసుపు ప్యాక్

ఒక టీ స్పూన్ ఆముదానికి అర టీస్పూన్ పసుపుపొడిని కలిపాలి. ముందుగా కడిగిన ముఖంపై ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక పావుగంట తర్వాత కడిగేయాలి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్తమునకు మెలనిన్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే గుణం ఉంది.

(ii) నిమ్మరసం, తేనె, ఆముదం మిశ్రమం

ఒక టీ స్పూన్ ఆముదానికి అర టీస్పూన్ నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ ముడి తేనె తీసుకొని కడిగిన ముఖంపై మర్దన చేయండి. దీన్ని సుమారు 20 నిముషాల పాటు ముఖంపై ఉంచి, కడిగివేయండి. నిమ్మ రసం చర్మాన్ని తెల్లబరుస్తుంది. ఇది పెద్ద చర్మపు రంధ్రాలను తగ్గిస్తూ అధిక మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. తేనె శుభ్రపరుస్తుంది మరియు దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేస్తాయి.

(iii)విటమిన్ ఈ మరియు ఆముదం మిశ్రమం

విటమిన్ ఈ పాడైన చర్మాన్ని బాగుచేస్తుంది. ఒక టీ స్పూన్ ఆముదానికి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపి ముఖానికి చక్కగా నెమ్మదిగా మర్దన చేయాలి. ఒక పావుగంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి.

సహజమైన ఏ పద్ధతీ కూడా రాత్రికి రాత్రి పని చేయదు. క్రమ పద్ధతిలో కొన్ని రోజులపాటు దీన్ని వాడటం వలన లాభాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు.

2. మొటిమలను, మచ్చలనూ తగ్గిస్తుంది

మొటిమలకు గురయ్యే చర్మం కలిగిన వారు చాలా నూనెలకు దూరంగా ఉంటారు- ఎందుకంటే నూనెలు చర్మరంధ్రాలను అడ్డుకోవడం వల్ల వారి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. మొటిమలను తగ్గించడం కోసం ఆముదాన్నిఉపయోగించవచ్చు.

  • నిద్ర పోయే ముందు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇది చర్మరంధ్రాలు తెరుచుకోవడానికి సహాయం చేస్తుంది.
  • తరువాత ఆముదాన్ని గుండ్రంగా ముఖంపై మర్దన చేయాలి.
  • రాత్రి ఉంచి మరియు మరుసటి ఉదయం చల్లని నీటితో ముఖాన్ని కడగాలి.

3. పగిలిన పెదవులను మృదువుగా చేస్తుంది

చలికాలంలో అందరూ ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది పెదవులు పగలడం. కొందరికి వేసవి వేడికి కూడా పెదవులు పగులుతాయి.

పెదవులు పొడిబారి, పగిలి మిమ్మల్ని బాధిస్తుంటే వాటికి కొద్దిగా ఆముదంతో మర్దన చేయండి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి, పగలడం తగ్గుతుంది.

4. కళ్లచుట్టూ నల్లని వలయాలను తగ్గిస్తుంది

ఆముదం కళ్ళకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలసిపోయిన కళ్ళకు, కళ్ళ చుట్టూ నల్లని వలయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రపోయేముందు కళ్ల చుట్టూ ఆముదాన్ని మృదువుగా మర్దన చేసి రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే కడగాలి. ఆముదం కళ్ళలోనికి వెళ్లనివ్వకండి.

ఆముదం కళ్ళ చుట్టూ నల్లని వలయాలకే కాదు కనుబొమలు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ కనుబొమలపై రాస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి.

5. ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలను (పిగ్మెంటేషన్) తగ్గిస్తుంది

కొందరికి ముఖంపై అక్కడక్కడా మచ్చలుంటాయి. వయసురీత్యా వచ్చే ఈ మచ్చల్ని కనిపించకుండా చేయాలంటే కొద్దిగా ఆముదాన్ని తీసుకుని మచ్చలున్న చోట మృదువుగా మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. రిసినోలేయిక్ ఆమ్లం ఆముదంలో ఉండే ఒక ముఖ్యమైన పోషకం. ఇది చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది (1).

అర టీస్పూన్ ఆముదాన్ని నాలుగు చుక్కలు టీ ట్రీ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ హొహోబా ఆయిల్ లతో కలిపి ముఖానికి అప్లై చేయాలి. టీ ట్రీ ఆయిల్ దాని క్రిమినాశక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. టీ ట్రీ ఆయిల్ కూడా పిగ్మెంటేషన్ని తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాకా ముఖాన్ని కడగాలి.

తరచూ ఈ విధంగా చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

6. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది

ఆముదంలో కొవ్వు ఆమ్లాలుంటాయి. ఇవీ సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి (2). ఆముదాన్ని బాగా ఇంకేలా చక్కగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట బాగా మర్దనా చేయాలి. బాగా ఇంకడానికి వేడిగా కాపడం పెట్టండి, 15-20 నిమిషాల తరవాత కడిగేయండి. ఇలా స్నానం చేసేముందు చేస్తే సౌకర్యంగా ఉంటుంది.

7. వయసు పెరగటం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తుంది

Reduces the wrinkles of aging Telugu
Image: Shutterstock

రాత్రిపూట పడుకోవడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కుని ఏదైనా నూనెలో కొద్దిగా ఆముదం కలిపి రాసుకుని మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గి ముఖం చక్కగా తయారవుతుంది (3).

8. ఎర్రబడి ట్యాన్ ఐన చర్మాన్ని తెల్లగా చేస్తుంది

ఆముదంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల ఎర్రబడిన లేదా ట్యాన్ ఐన చర్మంపై చక్కగా పని చేస్తుంది.

స్నానానికి వెళ్లేందుకు 15 నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా తాజాగా మారుతుంది.

9. చర్మాన్ని తేమగా ఉంచుతుంది

ఆముదం చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఆముదం మరియు కలబంద గుజ్జు (అలోవెరా జెల్) లను సమానంగా తీసుకొని బాగా కలిపి మృదువుగా మర్దన చేయాలి. 20 నిమిషాలు అలానే ఉంచాలి. అలోవెరా జెల్ లో గిబ్బరెల్లిన్స్ ఉంటాయి. అందువల్ల ఇది ఆముదంతో కలిసినప్పుడు రక్త సరఫరా మెరుగుపరచి చర్మాన్ని తేమగా ఉంచుతుంది (4).

10. చర్మంపై వచ్చే అసాధారణ మచ్చలను తగ్గిస్తుంది

ఆముదాన్ని బాదం నూనెతో సమానంగా కలిపి మరిగించి చల్లారిన తర్వాత మచ్చలపై రాసి తర్వాత ఆవిరి పట్టాలి. దీనివల్ల చర్మపు రంధ్రాలు తెరుచుకొని చర్మం పై ఉండే మచ్చలు కొద్దికొద్దిగా తగ్గిపోతాయి (5).

ఆముదంతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు

ఆముదము నూనె జుట్టు పొడవుగా మరియు మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపాల వలన, అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో, ఒత్తిడి, మానసిక కారణాలు మరియు జీవనశైలిలో లోపల వలన కలిగే బట్టతలను తగ్గించుటకు చికిత్సగా కూడా వాడతారు.

11. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

కొంతమంది జుట్టు చాలా బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలు తొందరగా ఊడిపోతుంది. అలా కాకుండా జుట్టు బలంగా ఉండాలంటే ఆముదం నూనె ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దృఢమైన, పొడవాటి జుట్టును పొందుతారు (6).

12. జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది

ఆముదం నూనె మంచి మాయిశ్చరైజర్‌గా, కుదుళ్లకు కండీషర్‌గా పని చేస్తుంది. తల బాగా నొప్పిగా, వేడిగా ఉన్నప్పుడు ఆముదం నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తల నొప్పిని తగ్గించటంతో పాటు మృదువైన, కాంతివంతమైన వెంట్రుకలను అందిస్తుంది (7).

13. చుండ్రును నివారిస్తుంది

Avoid dandruff
Image: Shutterstock

జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఆముదం నూనెను ఉపయోగించాలి. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఆముదం నూనెలో రెండు చుక్కల హొహోబా నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు తగ్గటమే కాక జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.

ఆరోగ్యం కోసం ఆముదం ప్రయోజనాలు

14. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

ఆముదాన్ని కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని దూరం చేసుకోవచ్చు. కానీ దీన్ని దీర్ఘకాలం తీసుకోవడం అంత మంచిది కాదు. దీన్ని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల పెద్దప్రేగు సహజంగా పనిచేసే సామర్ధ్యాన్ని కోల్పోతుంది.

15. కీళ్ల వాతం/ కీళ్ల నొప్పి / మోకాలు నొప్పి లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది

ఆముదం కీళ్ళవాతము వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది (8).

ఒక నూలు వస్త్రాన్ని తీసుకొని చతురస్రాకారంగా మడతపెట్టి ఆముదం నూనెలో ముంచి ఎక్కువగా ఉన్న నూనెను పిండేయాలి. ఆ బట్టను నొప్పి ఉన్న కీళ్లపై పెట్టి దాన్ని ఒక ప్లాస్టిక్ రాప్ తో జాగ్రత్తగా చుట్టాలి. ఆపై వేడి నీటి సీసాను పెట్టి కానీ హీటింగ్ పాడ్ తో కానీ కాపడం పెట్టాలి. అలా ఒక గంటపాటు అలానే వదిలేయాలి. ఇలా తరచు చేయడం వల్ల కీళ్లనొప్పులు నివారించవచ్చు.

ఆముదంలోని వాపులను తగ్గించే గుణం నొప్పులు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది.

16. వెన్ను నొప్పిని తగ్గిస్తుంది

ఆముదాన్ని ఒక పూతగా వెన్నుపై మృదువుగా మర్దన చేసి దానిపై ఒక వస్త్రాన్ని కప్పి ఉంచాలి. దానిపై వేడి నీటి బాగ్ (హాట్ వాటర్ బాగ్) ను ఉంచాలి.

ఆముదం వలన కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Castor Oil in Telugu

1. గర్భధారణ సమయంలో

సాధారణ ప్రసవానికై నొప్పులు రావడానికి ఆముదాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ అవగాహన లేకుండా వాడటం వల్ల ఉపయోగాల కంటే దుష్ప్రభావాలు ఎక్కువ. అందువల్ల వైద్యులు గర్భిణులకు దీన్ని వాడొద్దని సూచిస్తారు.

2. పిల్లలకు

పిల్లలకు ఆముదాన్ని వాడటం వల్ల ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలూ కూడా ఉన్నాయి.
చిన్న పిల్లలకు చర్మం పైన, జుట్టు పైన కనుబొమలపైనా నిరభ్యంతరంగా మర్దన చేయవచ్చు. చర్మంపై వచ్చే చిన్న చిన్న గాయాలు డైపర్ రాష్ లను తగ్గించడానికి ఆముదం ఎంతో ఉపయోగకరం.

చంటిపిల్లలు మలబద్దకంతో బాధపడుతుతుంటే కొద్దిగా ఆముదాన్ని వారి మలద్వారం చుట్టూ మర్దన చేస్తే ఆ ప్రదేశం మెత్తబడి ఆ సమస్యను దూరం చేస్తుంది.

అయితే కొంతమంది ఆముదాన్ని పిల్లలచే త్రాగిస్తారు. తరచుగా ఇలా చేయడం వల్ల పిల్లల శరీరం దాన్ని తట్టుకోలేక పెద్దప్రేగు మెలిక పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

3. వికారంగా అనిపించటం

ఆముదం జీర్ణాశయ సమస్యలను అన్నిటిని తగ్గిస్తుంది. కానీ, కొంత మందికి ఆముదం తాగటం వలన వికారంగా కూడా అనిపించవచ్చు. దీనికి కారణం ఆముదంలో ‘రిసినోలేయిక్ ఆసిడ్’. ఈ ఆసిడ్ నయం చేసే గుణాలతో పాటుగా, చికాకులను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జీర్ణాశయంలో దుష్ప్రభావలను కలుగచేసి, వికారాన్ని కలిగిస్తుంది.

4. విరేచనాలు

ఆముదం వలన కలిగే మరొక దుష్ప్రభావం – విరేచనాలు. ఆముదాన్ని మలబద్దకం తగ్గించే లాక్సైటీవ్ లా పరిగనిస్తారు. కానీ కొంతమందిలో ఇది వ్యతిరేఖంగా పనిచేసి, విరేచనాలకు కారణమవుతుంది.

5. చర్మంపై దద్దుర్లు

Rash on the skin
Image: Shutterstock

ఆముదం వాడకం వలన జీర్ణశయాంతరాలలో ఒత్తిడి మాత్రమేకాకుండా, చర్మంపై ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చర్మంపై ఆముదంను అప్లై చేయటం వలన కొంతమందిలో అలర్జీ చర్యలు కలగవచ్చు. కావున, ఆముదం వలన మీ చర్మానికి అలర్జీ కలుగుతుందో లేదో తెలుసుకోండి. ఒక చుక్క ఆముదంను చర్మంపై వేసి, ఎవైన అలర్జీలు జరిగాయా లేదా అని చూడండి. ఒకవేళ మీ చర్మంపై దద్దుర్లు లేదా ఎవైన అసామాన్య మార్పులు కనపడితే ఆముదం పట్ల మీరు అలర్జీ కలిగి ఉన్నారని అర్థం.

6. కండరాల తిమ్మిరులు

ఆముదం వాడకం వలన కండరాలలో తిమ్మిరులుగా అనిపించటం సాధారణ దుష్ప్రభావం. ఈ నూనె సహాయంతో మసాజ్ చేయటం వలన కూడా కండరాలు తిమ్మిరులకు గురైనట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా, కొంతమందిలో ఉదరభాగంలో నొప్పి/ తిమ్మిరుల వంటి వాటికి గురవుతుంటారు.

7. తల తిరుగుతున్నట్లు అనిపించటం

అధికంగా ఆముదం నూనె తీసుకోవటం వలన కొంత మందిలో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి భావనకు గురైన వారు వెంటనే ఆముదంను అధికంగా కాకుండా, తగిన మోతాదులో మాత్రమే తీసుకోండి.

అందువల్ల ఆముదం వాడే ముందు మీపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఉందేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొద్దీ మోతాదులో ఆముదాన్ని తీసుకొని ముందుగా పరీక్షించి తీసుకోవడం మంచిది.

ఆముదము యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Castor Oil in Telugu

ఆముదం లో లభించే కొవ్వు ఆమ్లాలు
ఆమ్లం పేరుసగటు శాతం
రిసినోలేయిక్ ఆసిడ్95to85%
ఒలేయిక్ ఆసిడ్6to2%
లినోలెయ్క్ ఆసిడ్5to1%
లినొలెనిక్ ఆసిడ్1to0.50%
స్టీయరిక్ ఆసిడ్1to0.50%
పాల్మీటిక్ ఆసిడ్1to0.50%
డిహైడ్రోక్సీస్టీయరిక్ ఆసిడ్0.5to0.30%
ఇతర ఆసిడ్లు0.5to0.20%

ఆముదం నూనెలో విటమిన్‌ ఈ, ప్రోటీన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆముదంలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీయాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా, చర్మానికి అవసరమయ్యే పోషకాలు మరియు అత్యవసర విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడతాయి.

ఆముదం లోని రకాలు – Types of Castor Oil in Telugu

ఎటువంటి ఆముదాన్ని వాడాలి అనేది చాలామందికి వచ్చే అనుమానం. సహజ ఆముదం, జమైకా నల్ల ఆముదం మరియు హైడ్రోజనేటెడ్ ఆముదం అని మూడు రకాలు ఉన్నాయి.

  • సహజ ఆముదం

ఇది పసుపు రంగులో ఉంటుంది. దీన్ని నేరుగా విత్తనాల నుండి ఏ విధమైన వేడీ చేయకుండా యాంత్రిక పద్దతిలో రసాయనాలను వాడకుండా సంగ్రహిస్తారు.

మీరు గిరజాల జుట్టు మరియు చికాకు, దురద కలిగించే పొడి చర్మం కలిగి ఉంటే, జమైకా నల్ల ఆముదం కంటే తక్కువ ఆల్కలీన్ కల, హెక్సాన్ రహిత సహజ ఆముదాన్ని వాడటం మంచిది.

  • జమైకా నల్ల ఆముదం

ముందుగా గింజలను వేయించి తరువాత నూనె తీస్తారు.

కాల్చిన ఆముదపుగింజలపొడిని మరల చిక్కటి నలుపు రంగు కోసం నూనెలో కలుపుతారు. మెత్తని జుట్టు, ఆరోగ్యకరమైన తల కలవారు దీనిని వాడవచ్చు.

  • హైడ్రోజినేటెడ్ ఆముదం (ఆముదపు మైనం)

ఇది ఒక నికెల్ ఉత్ప్రేరకం సహాయంతో స్వచ్ఛమైన ఆముదంను హైడ్రోజెనైజ్ చేయడం ద్వారా లభిస్తుంది.

సాధారణ ఆముదంలా కాకుండా, ఆముదపు మైనం, పెళుసైనది వాసన లేనిది, మరియు నీటిలో కరగదు.

జమైకా నల్ల ఆముదం మరియు సహజ ఆముదం ఒకే విధమైన పోషక విలువలు కలిగి ఉన్నా కూడా సహజ ఆముదం తక్కువ ఆల్కలీన్ కలిగి ఉంటుంది.

మీకు ఎటువంటి అలర్జీలు దుష్ప్రభావాల భయం లేదని తెలుసుకొని వాడటం మొదలుపెట్టి, దేనికైనా సరే ఒక నిర్ణీత సమయం పాటిస్తూ తరచుగా వాడటం లేదా ప్రతీ రోజూ వాడటం వలన మీ సమస్యలను అధిగమించవచ్చు. ఏ మార్పైనా రాత్రికి రాత్రే జరుగదు. అందువల్ల ఒకసారి వాడి వదిలేయడం కాక కొన్నాళ్ల పాటు వాడితే క్రమంగా మార్పును మీరే గమనించవచ్చు.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles