అవాంఛిత గర్భాన్ని అడ్డుకునేదెలా?
In This Article
సంతానోత్పత్తి మనుషులందరికీ ఉండే సహజమైన కోరికలలో ఒకటి. పిల్లల్ని కనడం అనేది జీవితాన్ని మార్చే బాధ్యత. పుట్టబోయే బిడ్డకు మీ జీవితమంతా బాధ్యత వహించాలి కనుక మీరు మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండడం మంచిది. లేకుంటే ఈ బాధ్యతను కొన్నాళ్లు వాయిదా వేయడం ఉత్తమం.
వివాహమైన జంటలలో అనుకోకుండా గర్భం ధరించడం అనేది చాలా సాధారణ విషయం, ఆమోదయోగ్యమైనది కూడా. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పెళ్ళికి ముందే సెక్స్ లో పాల్గొనటం కూడా సర్వ సాధారణం అయిపోయింది. కానీ అవాంఛిత గర్భం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
అవాంఛిత గర్భం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ క్రింది వాటిలో మీరు ఏదో ఒక రకంగా గర్భాన్ని నిరోధించవచ్చు.
1. కండోమ్ లేకుండా సెక్స్ వద్దు
గర్భం రాకుండా అడ్డుకునేందుకు ఇదొక మంచి జాగ్రత్త. కండోమ్ స్పెర్మ్ ను గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సెక్స్ సమయంలో కండోమ్ ను వాడకపోతే గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే లైంగిక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కండోమ్ కేవలం మగవారికే కాదు, ఆడవారికీ లభిస్తుంది. ఆడవారికోసం తయారుచేసిన కండోమ్ యోని లోపల టైట్ గా ఉండి, వీర్యము లోపలికి పోకుండా రక్షణగా పనిచేస్తుంది. ఆడవాళ్ళ కన్నా మగవారు కండోమ్ వాడితేనే చాలా సురక్షితం. కానీ అందులోనూ కొంత ప్రమాదం లేక పోలేదు. చిరుగుట, ఊడిపోవుట జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఒకేసారి ఆడా, మగా ఇద్దరూ కండోమ్ ధరించాల్సిన అవసరం లేదు.
2. గర్భ నిరోధక మాత్రలు రోజూ వేసుకోవాలి
స్త్రీలు రోజూ క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు వాడాలి. మాత్రలను మధ్యలో వేసుకోకపోతే, దాని ప్రభావం తగ్గుతుంది. అలాగే, వైరల్ జ్వరం రావడం, అనారోగ్యం పాలైనా ఈ మాత్రల ప్రభావం తగ్గుతుంది. రోజూ గర్భనిరోధక మాత్రలను నిర్ణీత సమయంలోనే వేసుకోవాలి. రోజుకో సమయనికి వేసుకోవడం వల్ల అవి ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. ఈ మాత్రలు క్రమపద్దతిలో వేసుకుంటే బాగా పనిచేస్తాయి.
3. అత్యవసర గర్భనిరోధక మాత్ర
పొరపాటున కండోమ్ చిరగడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మరుసటి రోజు ఉదయం ఒక గర్భనిరోధక మాత్రను వేసుకోవాలి. దాదాపు 72 గంటలు స్పెర్మ్ ని అండంతో కలవకుండా నిరోధించే శక్తి ఆ మాత్ర కి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒక శక్తివంతమైన మాత్ర లేదా పన్నెండు గంటల తేడాతో వేసుకునే మాత్రలను రెండింటిని తీసుకుంటే అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవచ్చు.
4. పీరియడ్స్ సమయంలో అసురక్షిత సెక్స్ తో ప్రమాదం
పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భం ధరించరన్న దురభిప్రాయం చాలా మందిలో నాటుకుపోయింది. సెక్స్ కు సురక్షితమైన సమయం అనేది ఉండదు. వీర్యాన్ని మంచి ఈతగాళ్లతో పోల్చడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అవి ప్రవాహంలో ఈదుతూ గర్భాశయంలోకి ప్రవేశించి అండంతో కలుస్తాయి. పీరియడ్స్ సమయంలో అవి ప్రవేశించే మార్గం మరింతగా ద్రవపూరితంగా ఉంటుంది. అలా అని ఆ ప్రవాహంలో వీర్యకణాలు ఈదలేవని అర్థం కాదు. చక్కగా ఈదుకుంటూ అండాన్ని చేరుకుంటాయి. కానీ పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల తీవ్ర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
5. జననేంద్రియాలను తాకనీయద్దు
జననేంద్రియాలను తాకేంత వరకు రానీయకపోవడమే మంచిది. ఆ ప్రాంతంలో చుట్టూ రుద్దడం వంటివి కూడా చేస్తుంటారు. ఈ పనుల వల్ల యోని ద్వారా వీర్యాన్ని లోపలికి తీసుకెళ్లే ద్రవం లీక్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఏ క్షణంలోనూ మీరు ఒక చిన్న వీర్య కణానికి ఉండే శక్తిని విస్మరించకూడదు. మనమందరం భూమి మీద ఉండడానికి అదే కారణం.
6. పురుషాంగాన్ని తాకిన చేతివేళ్లతో మీ జననేంద్రియాలను ముట్టనీయకండి
స్ఖలనానికి ముందే పురుషాంగం నుంచి తక్కువ పరిమాణంలో ద్రవపదార్థంలాంటిది ఉత్పత్తి అవుతుంది. ఇది సెక్స్ చక్కగా జరిపేందుకు లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు దీనిలో కొన్ని వీర్యకణాలు ఉండే అవకాశం ఉంది. కనుక స్ఖలనానికి ముందే వీర్యకణాలు మీ యోనిపై చేరుతాయి. ఆ అవకాశాన్ని ఇవ్వకండి.
అవాంఛిత గర్భం నివారించడానికి మరిన్ని ఇతర జాగ్రత్తలు
గర్భధారణను నిరోధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఇందులో గర్భనిరోధక మాత్రలను తీసుకోవడమే కాదు, కాపర్ టి వంటివి సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇతర రకాల గర్భనిరోధకాల గురించి మరింత తెలుసుకోండి.
7. డయాఫ్రామ్
డయాఫ్రాగమ్ అనేది యోనిలోంచి గర్భశయ ముఖద్వారం వద్ద అమర్చే గోపురం లాంటి కప్. వీర్యం కదలికలను నివారించడానికి స్పెర్మిసైడ్తో కలిసి ఇది పనిచేస్తుంది. వీర్య కణాలు అండాన్ని చేరకుండా నిరోధించి, గర్భం రాకుండా అడ్డుకుంటుంది. దాదాపు 6 గంటల పాటు రక్షణనిస్తుంది. మీరు స్వయంగా ఉపయోగించగలరు కూడా. మీరు దీనిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే పొందగలరు.
8. డిపో-ప్రోవెరా
మహిళల కోసం ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్‌తో తయారైన మరో గర్భ నియంత్రణ పద్ధతి ఉంది. ఇది చేతులు లేదా పిరుదులకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ ఇంజెక్షన్ 3 నెలల వరకు రక్షణ కల్పిస్తుంది. ఇది రుతు క్రమాన్ని నిరోధించి, గర్భం నివారించడంలో 99% ప్రభావవంతంగా పనిచేస్తుంది .
9. ఇంప్లాంట్లు
ఇంప్లాంట్లు చిన్న అగ్గిపుల్ల పరిమాణంలో ఉండే పరికరాలు. వీటిని మోచేయికి కాస్త పైగా చర్మం క్రింద అమరుస్తారు. అవి గర్భనిరోధక హార్మోన్లను, లెవోనార్జెస్ట్రెల్ స్టెరాయిడ్ను విడుదల చేస్తాయి. 3 – 5 సంవత్సరాల వరకు గర్భం రాకుండా నిరోధిస్తాయి. సాధారణంగా వాడుకలో ఉన్న ఇంప్లాంట్లు ఇంప్లానాన్, నెక్స్‌ప్లానన్ అనే రెండు. కానీ, ఇవి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తాయి. బరువు పెరగడం, రుతు చక్రంలో మార్పులు, ఎముక బరువు కోల్పోవడం, రొమ్ములు సున్నితంగా మారడం వంటి మార్పులు సంభవిస్తాయి.
10. IUD లేదా కాపర్ టి
గర్భాశయంలో అమర్చే టి-ఆకారపు పరికరం ఇది. వీర్య కణాలు అండాన్ని చేరకుండా అడ్డుకుంటుంది. డాక్టరు మాత్రమే కాపర్ టి ని గర్భాశయంలో అమర్చగలరు. 5 నుండి 10 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఉంటే కలయిక తరువాత ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు పరికరం బయటికి వచ్చేయవచ్చు, కనుక అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వల్ల కలిగే తిమ్మిరి, అసాధారణ రక్తస్రావం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు, కానీ ఇవి లోపల పెట్టే ముందు, తరువాత మాత్రమే కలుగుతాయి.
శాశ్వత గర్భనిరోధక పద్ధతులు
11. వేసెక్టమీ
ఇది పురుషులకు చేసే సురక్షితమైన, శాశ్వతమైన నియంత్రణ పద్ధతి. చిన్న శస్త్రచికిత్స ద్వారా వీర్య కణాలను తీసుకెళ్లే “వాసా డిఫెరెన్షియా” అనే భాగాన్ని కత్తిరించి మూసివేస్తారు. శస్త్రచికిత్స తర్వాత వెంటనే ఈ విధానం ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని వీర్య కణాలు మూసివున్న గొట్టాలకు వెలుపల ఉండవచ్చు. కనుక మూడు నెలల తరువాత ఈ పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తుంది.
12. ట్యూబెక్టమీ లేదా ట్యూబల్ స్టెరిలైజేషన్
ట్యూబెక్టమీ అనేది శాశ్వతమైన గర్భనిరోధక పద్ధతి. దీన్ని శస్త్రచికిత్స ద్వారా చేస్తారు. ఈ పద్దతిలో గర్భాశయం నుండి అండాశయంలోకి అండాలు ప్రయాణించకుండా ఫెలోపియన్ ట్యూబులను నిరోధిస్తారు. డాక్టర్ ఫెలోపియన్ గొట్టాలను కత్తిరించి, మూసివేస్తారు. ఇది చాలా సురక్షితమైన విధానం, మరియు ట్యూబెక్టమీ విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువ.
పైన వివరించినవన్నీ డాక్టర్ సహాయంతో తీసుకోవలసిన గర్భనిరోధక చర్యలు. సహజంగా గర్భాన్ని నిరోధించే విధానాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
సహజ గర్భ నిరోధక విధానాలు
1. సేఫ్ పీరియడ్ పద్దతి
కేవలం ఆహారం ద్వారానే కాదు, అండం విడుదలయ్యే రోజుల్లో కలయికకు దూరంగా ఉన్నా అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు.
సేఫ్ పీరియడ్ ని ఎలా లెక్కించుకోవాలి?
రుతు చక్రం కాల పరిమితి ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటుంది సగటు మహిళ పీరియడ్ కాలపరిమితి (duration) 28 రోజులనుకుందాము. పీరియడ్ సైకిల్ అంటే ఒక నెలలో రుతుస్రావం మొదలైన రోజునించి, వచ్చే నెలలో రుతుస్రావం మొదలయ్యే వరకు మధ్య గల రోజులు. సేఫ్ పీరియడ్ అంటే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కలిసినా గర్భం వచ్చే అవకాశం లేని రోజులు. సేఫ్ పీరియడ్ రోజులను ఓవులేషన్ కాలిక్యులేటర్ సాయంతో కనుక్కోవచ్చు.
2 బేసల్ బాడీ టెంపరేచర్ పద్ధతి
అందము విడుదలయ్యే సమయంలో శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉంటుంది. రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, మీరు ఉష్ణోగ్రతను ట్రాక్ చేయచ్చు. ఉష్ణోగ్రత గరిష్టంగా ఉన్న రోజు అండం విడుదలయ్యే రోజు. ఈ కాలంలో మీరు లైంగిక చర్యకు దూరంగా వుండాలి.
3. గర్భాశయ స్రావాన్ని ట్రాక్ చేయడం
పీరియడ్స్ ముగిసాక గర్భాశయం జిగటగా ఉండే స్రావాన్ని విడుదల చేస్తుంది. పారదర్శకంగా ఉండే జెల్లిలాంటి ఆ స్రావం అండం విడుదలను సూచిస్తుంది. కాబట్టి ఆ కాలంలో సెక్స్ కు దూరంగా ఉండడం ఉత్తమం.
వైద్య రంగంలో వచ్చిన పురోగతితో అనేక గర్భనిరోధక పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా, ఈ వ్యాసంలో పేర్కొన్న పద్ధతులు కుటుంబ నియంత్రణ కోసం కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది ప్రయత్నించినవి. కాబట్టి తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతులను ప్రయత్నించండి, అదికూడా వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే.
గర్భం రాకుండా ఉండటానికి మీరు ఏ సహజ పద్దతులను ఉపయోగించారో కింది కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.
ప్రస్తావనలు
2. Tekoa L. King, Mary C. Brucker; Pharmacology for Women’s Health; Pg no. 238;
3. E.Ernst; Herbal medicinal products during pregnancy: are they safe?; BJOG (2003)
4. Sage-Femme Collective; Natural Liberty: Rediscovering Self-induced Abortion Methods, Pg no. 236, 246-247,27
5. Menstrual Cycle; The Office on Women’s Health (2018)
6. Calendar Method; University of California, Santa Barbara (2012)
Community Experiences
Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.