పసి పిల్లలకు 13 రుచికరమైన వంటకాలు

Written by
Last Updated on

పసి పిల్లలకి తల్లి పాలను మించిన ఆహారం  ఏదీ లేదని మనకందరికీ తెలుసు. మరి ఘనపదార్ధాలు  పోషకాహారం ఎప్పటినించి, ఎలా తినిపించాలి అన్నది తల్లుల ప్రశ్న. పాపాయి తల నిలిపి, నోట్లో కదలికలు, నోరు చెంచా కోసం తెరవటం, మింగటం తెలిసిన తరువాత తినిపించడం మొదలుపెట్టాలి.

సాధారణంగా ఐదు-ఆరు నెలలకి ద్రావకం లాగానో, మెత్తటి పదార్ధం అంటే గుజ్జు లాగానో చేసి చిన్న చిన్న మోతాదులలో తినిపించాలి. ప్రతి శిశువు శరీర తత్వం వేరే వేరే గానే ఉంటుంది. ఒక్కొక్క ఆహారం రెండు రోజులు తినిపించి, వాళ్లకి అలర్జీలు, పడక పోవడాలు ఇలాంటివి  వస్తున్నాయేమో నని జాగ్రత్తగా గమనించాలి. తరువాతనే మరో రకం ఆహారం పరిచయం చెయ్యాలి. రెండు-మూడురకాల ఆహారాలు ఒక్కసారిగా పరిచయం చెయ్యకుండా ఉంటే మంచిది ఎందుకంటే పిల్లలకు ఏ ఆహారం పడింది, ఏది పడలేదో మనకి తెలియాలి కదా.

పసిపిల్లలకు ఎటువంటి ఆహారం పెడితే మంచిది, వాటిని తయారుచేసే విధానం ఏంటి అనేది ఈ మోంజుంక్షన్ పోస్ట్ లో తెలుసుకోవచ్చు.

ఆరు-ఏడు నెలల పసి బిడ్డలకి ఇవ్వగలిగే ఆహారం

పాపాయి ఆరు నెలలు దాటాక తల్లి పాలు తాగుతున్నా మధ్యలో నిమ్మదిగా ఘన ఆహారం చాలా  కొద్దిగా తినిపించవచ్చు. పగలు ఒక్కసారి పాలు  బదులుగా ఘన ఆహారం ప్రారంభించండి. ఈ కింద చెప్పిన వంటకాలు తయారు చేసి మీ పాపాయికి తినిపించవచ్చు

1. ఉగ్గు

ఉగ్గు ఇంట్లోనే చక్కగా తయారుచేసుకోవచ్చు.

కావలసిన సామగ్రి

  • బియ్యం 1కప్పు
  • కందిపప్పు పావు కప్పు
  • సెనగ పప్పు పావు కప్పు
  • పెసర పప్పు పావు కప్పు
  • పెసలు పావు కప్పు
  • బాదం, జీడిపప్పు ఒక పావు కప్పు
  • వేరుశనగ పలుకులు (పల్లీలు) పావు కప్పు

(మీ పాపాయికి  నట్స్ ఎలర్జీ ఉంటే గనుక, ఆ నట్స్ ని వాడడం మానివేయ్యండి)

తయారీ విధానం

  • బియ్యం, పప్పులు అన్నీ బాగా కడిగి, ఎండలో బట్టపై ఆరబెట్టాలి.
  • బాగా ఆరాక, బాణలిలో వేసి వేయించాలి.
  • కమ్మని వాసన వస్తూ, బంగారు రంగులోకి  మారాక, చల్లార్చి, పొడిగా చేసుకుని ఒక గాలి దూరని సీసాలో దాచుకోవాలి.
  • రోజూ మధ్యాహ్నం భోజనం సమయానికి  ఒక గ్లాస్ వేడి నీళ్ళకి ఒక స్పూన్ పొడి ఉండలు లేకుండా బాగా కలిపి, ద్రవాన్ని ఉడికించాలి.
  • అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి, కలిపి స్పూన్ తో గానీ,లేదా చేతితో గాని చిన్న మొత్తం తీసుకుని తినిపించాలి.

2. బియ్యం జావ

Rice java
Image: Shutterstock

ఇది జీర్ణానికి సులువుగా ఉండే అన్నం జావ.

కావలసిన సామగ్రి:

  • బియ్యం ఒక కప్పు
  • వాము రెండు చెంచాలు
  • శొంఠి ఒక చెంచా

తయారీ విధానం

వాము పొడి, శొంఠి పొడి: 

  • వాము దోరగా వేగించుకుని, కొంచం ఉప్పు చేర్చి మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని, సీసాలో వేసి నిలవుంచుకోవచ్చు.
  • శొంఠిని కొందరు నిప్పులపై కాలుస్తారు.
  • లేదా మూకుడు లో కొద్దిగా నూనె వేసి శొంఠి పొంగే లాగా వేగించుకుని, చల్లారాక, కొంచం ఉప్పు కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

జావ 

  • బియ్యం ఒక గంట నానేసి, ఆరబెట్టి, మిక్సీలో నూకలుగా పొడి చేసుకోవాలి.
  • దానిని కొంచెం దోరగా వేగించి, అన్నం బహు మెత్తగా చెయ్యాలి.
  • దానిలో వేగించిన వాముగాని, శొంఠి పొడి గాని, కొంచెం  నెయ్యి కలిపి, కొంచెం కొంచెం గా తినిపించాలి.

3. అన్నప్పరవాణ్ణం

Annapparavannam

ఆరు నెలలు వచ్చాక, మనవాళ్ళు అన్నప్రాసన చేస్తారు. ఆ రోజు పరమాన్నం  మామయ్య చేతిమీదుగా నాకిస్తారు. ఇప్పుడు అన్నప్పరవాణ్ణం ఎలా చెయ్యాలో తెలుసుకుందాము.

కావలసిన సామగ్రి:

  • నానబెట్టిన  బియ్యం 1 కప్పు
  • చిక్కటి పాలు 1  లీటర్
  • బెల్లం 1  కప్పు
  • నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి

తయారీ విధానం

  • బియ్యం కడిగి, పాలల్లో ఉడకబెట్టాలి.
  • చాలా ఓపిగ్గా చిన్న సెగపై బాగా మెత్తగా ఉడికనివ్వాలి. మధ్యలో అడుగంటకుండా కలుపుతూ  ఉండాలి.
  • ఈలోగా బెల్లం మరో గిన్నెలో వేసి, తగిన నీటిలో కరగబెట్టి, చిక్కని ద్రవంగా ఉడకబెట్టాలి.
  • దింపి, కొంచెం చల్లార్చాలి (అందులో మలినాలు లేకుండా వడతేర్చాలి).
  • నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్మిస్లు వేయించాలి.
  • అన్నం బాగా ఉడికాక, దింపి, బెల్లం ద్రావకం అందులో కలిపి పైన నెయ్యి, అందులో వేగిన పప్పులు, యాలకుల పొడి కలపాలి. ఉడుకుతున్నప్పుడే బెల్లం వేస్తే, పాలు విరిగేపోయే ప్రమాదం ఉంది.

పాపాయికి పెట్టేటప్పుడు జీడిపప్పు, కిస్స్మిస్స్  లాంటివి పెట్టకుండా చూసుకోవాలి. అవి గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఉంది.

4. చక్కెర పొంగలి

Sugar boils
Image: IStock

పిల్లలు  తీపి పదార్ధం ఇష్టంగా తింటారు. వాటిలో పోషకాలు ఉన్న చక్కెర పొంగలి ఒకటి.

కావలసిన సామగ్రి:

  • బియ్యం  1 కప్పు
  • పెసరపప్పు 1  కప్పు
  • చక్కెర 1 కప్పు
  • జీడిపప్పులు 4
  • కిస్మీస్లు 4
  • ఏలకుల పొడి కొద్దిగా
  • నెయ్యి 4  చెంచాలు

తయారీ విధానం

  • ముందుగా  బియ్యం, పెసరపప్పు పచ్చితనం  పోయేట్టు దోరగా వేయించుకోవాలి.
  • దానిలో తగినన్ని పాలు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మాడకుండా జాగ్రత్తగా గరిటతో కలుపుతూ ఉండాలి.
  • ఉడికిన దాంట్లో చక్కెర పోసి బాగా కలపాలి.
  • బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మీస్సులు వేయించుకుని పక్కనపెట్టుకోవాలి.
  • అన్నం దగ్గిరగా ముద్దగా వచ్చాక, నెయ్యి, వేయిచిన డ్రై ఫ్రూప్ట్స్, యాలకుల పొడి వేసి మూతపెట్టాలి. ఇది కూడా చాలా కొద్దిగా తినిపించచ్చు.

5. క్యారెట్ ప్యూరీ

Carrot Puree
Image: IStock

తియ్యగా ఉండే ఈ క్యారెట్ ప్యూరీ పిల్లలు ఇష్టబడితే, విటమిన్స్, ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి.

కావలసిన సామగ్రి:

క్యారెట్ – 1

నీళ్లు తగినన్ని

తయారీ విధానం

క్యారెట్ని చెక్కు తీసి, మధ్య భాగం కూడా తీసి, చిన్న ముక్కలు గా తరగాలి.

తగిన నీటిలో ఈ ముక్కలని వేసి ఉడకబెట్టాలి.

ఉడకబెట్టాక నెమ్మదిగా వాటిని గుజ్జు చెయ్యాలి.

6. పప్పు, చారు అన్నం

Dal and soup rice
Image: Shutterstock

చారు జీర్ణానికి చాలా మంచిది. పులుపు కూడా పాపాయి నోటికి రుచి చూపించచ్చు

కావలసిన సామగ్రి:

  • బియ్యం ఒక కప్పు
  • కందిపప్పు రెండు చెంచాలు

చారుకి కావలసిన సామాగ్రి:

  • చింతపండు గోళీకాయ అంత (నానబెట్టి) లేదా టమాటో ఒకటి
  • కరివేపాకు, కొత్తిమీర కొంచెం
  • బియ్యం నానబెట్టి, ఉడక బెట్టుకోవాలి.
  • కొంచం కందిపప్పు వేయించి, తగిన నీరు పోసి కుక్కర్ లో బాగా మెత్తగా ఉడక బెట్టుకోవాలి.
  • రెండిటిని కలిపి చాలా మెత్తగా గుజ్జు చేసి అందులో కొంచం చారు పోసి, నెయ్యి కలపాలి.

చారు చేసే విధానం: 

  • చింతపండు గుజ్జును నీటిలో వేసి మరిగించాలి.
  • అందులోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు వెయ్యాలి.
  • దించేముందు కొంచెం కొత్తిమీర వేసి, తిరగమాత పెట్టాలి.

7. సుజీ ఆపిల్ హాల్వా

Suzy Apple Halwa
Image: Shutterstock

ఇది మెత్తగా, పిల్లలకి రుచిగా ఉంటుంది.

కావలసిన సామగ్రి:

  • ఉప్మా రవ్వ 1 చిన్న కప్పు
  • ఆపిల్ ఒకటి
  • పాలు
  • పంచదార
  • కొంచెం నెయ్యి

తయారీ విధానం

  • రవ్వ ని కొంచెం నెయ్యి వేసి బాణలిలో దోరగా వేయించాలి. వేయించడం వల్ల ఉండలు కట్టదు,పైగా కమ్మదనం వస్తుంది.
  • ముందుగా ఒక ఆపిల్ తొక్క తీసి, గింజలు తీసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
  • వేయించిన రవ్వ లో కొంచెం నీరు, పాలు పోసి ఉడికించుకోవాలి. అది ఉడికాక, ఆపిల్ గుజ్జు, కొంచెం  పంచదార వేసి, బాగా ఉడకనివ్వాలి.

మరికొన్ని సులభంగా చేసే ఆహార పదార్థాలు  

  • కొంతమంది పిల్లలు ఒట్టి మెత్తటి అన్నంలో నెయ్యి, ఉప్పు కలుపుకుని తినడానికి ఇష్టం చూపిస్తారు.
  • ఒక బంగాళా దుంప, చిన్న కారెట్టు ఉడక బెట్టి, గుజ్జులాగా చేసి కొంచం ఉప్పు, జీలకర్ర పొడి వేసి  తినిపించవచ్చు. కూరగాయలు కూడా ఉడకబెట్టి, మెత్తగా గుజ్జు చేసి, జీలకర్ర, తగిన ఉప్పు కలిపి తినిపించచ్చు. ఒక్కోసారి కమ్మని పెరుగుతో కూడా కలిపి తినిపించచ్చు.
  • ఒక ఆపిల్ని చెక్కు తీసి, కుక్కర్లో ఉడకబెట్టి, బాగా గుజ్జు చేసి, కొంచెం కొంచెం గా తినిపించాలి.

సాధ్యమైన  వరకు ప్యాకెడ్ (packed), నిల్వ ఉన్న ఆహారం పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎట్టి పరిస్థితిలోను పిల్లలకి కూల్ డ్రింక్స్, మైదా తో చేసిన బైట జంక్ ఆహారం దగ్గిరకి రానియ్యకూడదు. ఎందుకంటే, ఒక్కసారి ఆ రుచి ని ఇష్టపడితే, ఎగబడి అవే కావాలంటారు.

ఏడో నెల నుంచి మొదటి సంవత్సరం వరకు ఇవ్వగలిగే ఆహారం

ఈ వయసులో పిల్లలకి రోజుకి రెండు సార్లు వండిన ఆహారం పెట్టవచ్చు.పొద్దున్న 10 గంటల కి మరోసారి సాయంత్రం 5 గంటలకి తినిపిస్తే ఆహారం అరిగి, ఆరోగ్యం చేకూరుతుంది. సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే వంటతోనే , కొంచం కారం మరీ వేయకుండా విడిగా  తీసి, తినిపించాలి. నెమ్మదిగా వాళ్ళు మన రొటీన్ లోకి వొస్తారు.

8. కాయకూరలు, పప్పు కిచిడి

Vegetables and lentils
Image: IStock

కిచిడి ని పిల్లలకి తినిపిస్తే, అందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి.

కావలసిన సామగ్రి:

ఈ కింది కూరల్లో ఏదైనా వాడవచ్చు

  • ఆలుగడ్డలు
  • ఆనపకాయ
  • చిలకడ దుంప
  • అరిటి కాయ
  • బీట్రూట్
  • దోసకాయ
  • ఆకుకూరలు – పాలకూర,తోటకూర  మొదలైనవి

తయారీ విధానం

  • నానేసిన బియ్యంలో పెసర పప్పు కానీ, కందిపప్పు కానీ కొద్దిగా వేసి, అందులోనే తరిగిన కాయగూరలు, ఒక బంగాళా దుంప,లేదా అరటికాయ ముక్క వేసి కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి.
  • బాగా గుజ్జుగా చేసి అందులో తగిన ఉప్పు,నెయ్యి వేసి చెంచా తో తినిపించాలి.

9. సెట్ దోశ

Set error
Image: IStock

పిల్లలకి పళ్ళు వచ్చే వయసు కాబట్టి, వాళ్లకి మెత్తటి సెట్ దోశ చేసి తినిపించచ్చు.

కావలసిన సామగ్రి:

  • మినప్పప్పు 1  కప్పు
  • బియ్యం  2 కప్పులు
  • అటుకులు  సగం కప్పు

తయారీ విధానం

  • మినప్పప్పు,  బియ్యం బాగా కడిగి, కనీసం మూడు గంటలు నానబెట్టి, కొద్దిగా నీరు తో  రుబ్బాలి.
  • పెనం పై నూనె వేసి, ఆ పిండి తో కొంచం లావుగా దోశ వేసి, పైన ఒక మూత పెట్టాలి.
  • కొంచం సేపైనతరువాతచుస్తే, తడిదనం పోయి తీయడానికి వీలుగా అవుతుంది.
  • ఆ దోసని తిప్పి రెండో పక్క కూడా ఒక నిమిషం పెట్టి, ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • దాని తో ఏదో ఒక కారం లేని, కమ్మని పోడో, పచ్చి కొబ్బరి తో కమ్మని పచ్చడో వేసి తినిపించవచ్చు. లేదా అలాగే కమ్మగా పెట్టవచ్చు.

10. పెసరట్టు

Pesarattu
Image: Shutterstock

మీ పాపాయి జీర్ణశక్తి పెరిగింది అనుకుంటే గనుక, పెసరట్టు కూడా పెట్టవచ్చు.

కావలసిన సామగ్రి:

  • పెసలు ఒక కప్పు
  • బియ్యం ఒక కప్పు
  • జీలకర్ర ఒక చెంచా
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు

తయారీ విధానం

బియ్యం, పెసలు కలిపి నానేసి, రుబ్బి, దానిలో కొంచం కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి బాగా మెత్తగా రుబ్బాలి.

పెసరట్టు వేసి, దాని మీద ఉల్లిపాయలు జల్లి, దోస లాగా వేసి రుచి చూపించచ్చు.

11. ఇడ్లీలు

ఇడ్లీలు 
Image: IStock

ఇడ్లీ సాధారణమైన ఉపహారం, పైగా బాగా సులువుగా అరుగుతుంది.

కావలసిన సామగ్రి:

  • బియ్యం 2  కప్పులు
  • మినప్పప్పు 1 కప్పు

తయారీ విధానం:

  • రెండిటిని కలిపి 4 గంటలు బాగా నానబెట్టి, కడిగి, వెట్ గ్రైండర్ లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పు కూడా కలిపాలి.
  • ఇందులో కొందరు క్యారెట్ తురిమి వేస్తారు మంచి రంగు తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
  • మరో నాలుగు గంటలు పిండి నానాక, ఇడ్లి పాత్రకి కొంచం నెయ్యి రాసి, పిండిని ఇడ్లి ఆకారంలో నింపి, ఆవిరి పై ఉడికించాలి.
  • 20 నిమిషాలలో  ఇడ్లి రెడీ అవుతుంది.
  • ఒక్కొక్కటి తీసి, దానిపై నెయ్యి రాసి, మంచి కొబ్బరి, పుట్నాల పచ్చడితో కానీ, పల్లీల పొడితో కానీ తినిపించచ్చు.

మరికొన్ని సులభంగా చేసే ఆహార పదార్థాలు  

  • స్నాక్స్ లాగా ఆవిరిపై ఉడికించిన ఆపిల్ పండు గుజ్జు, సపోటా, అవకాడో, పుచ్చకాయ ముక్కలు, రకరకాల పళ్ళు అలవాటు చెయ్యాలి. ద్రాక్షలుకూడా మంచిదే. ఏయే కాలంలో ఆయా పళ్ళు పరిచయం చెయ్యాలి.
  • మాంసాహారులుకూడా ఎనిమిది నెలల నుంచి సంవత్సరం దాటాక, డాక్టర్ ని సంప్రదించి పెట్టవచ్చు. గుడ్డు ఉడికించి కానీ, ఆమ్లెట్ గా కానీ తినిపించవచ్చు.

ఒకటిన్నర ఏళ్ళ పిల్లలకి ఆహారం 

ఈ వయసు కల్లా పిల్లలకి రుచులన్నీ చక్కగా తెలుస్తాయి. మరీ పేస్ట్ లాగా కాక, కొంచెం చిన్న ముక్కలుగా పెట్టాలి. ఎప్పుడు చేసే, పప్పు, అన్నం, వగైరా వంటకాల తో పటు, కొన్ని వెరైటీ వంటకాలు కూడా చేస్తే బాగుంటుంది.

పిల్లలకి నచ్చే తమాషా వంటకాలు:

12. గారెలు

Gare
Image: IStock

నూనెలో దేవే గారెలు నచ్చని వారు ఉండరు కానీ ఇవి మీ పిల్లలికి అప్పుడప్పుడే పెడితే మంచిది.

కావలసిన సామగ్రి:

మినప్పప్పు  ఒక కప్పు

నూనె   వేయించడానికి తగినంత

తయారీ విధానం:

  • మినప్పప్పు రెండు-మూడు గంటలు నీటిలో నానేసి, ఒక్కసారి కడిగి, చాలా తక్కువ నీటి తో గ్రైండ్ చేసి, కొంచం ఉప్పు కలపాలి.
  • ఆ పిండిని చేతిలోకి తీసుకుని, వేళ్ళతో  గుండ్రంగా వత్తి, వేలితో మధ్యలో ఒక చిల్లు పెట్టాలి.
  • నూనె లో వేసి, బాగా వేయించాలి.
  • పిల్లల ఇష్టాన్ని బట్టి వేడి-వేడి వడలని మొదట నీటిలో ముంచి, తీసి పెరుగులో వేసి, పెరుగు గారెలు చేసి తినిపించచ్చు.
  • పిల్లలకి పళ్ళు కూడా ఉంటాయి కాబట్టి కొరుక్కుని తినాలనే ఆసక్తి ఉంటుంది.

13. కట్టే పొంగలి లేదా వెంపొంగలి

bundle of pangolin
Image: Shutterstock

బియ్యం, పప్పు, నెయ్యి బాగా ఉన్న ఈ పొంగలి ఆరోగ్యకరం, రుచికరం కూడా.

కావలసిన సామగ్రి:

  • పెసరపప్పు అర కప్పు
  • బియ్యం అర కప్పు
  • కొంచెం అల్లం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, నెయ్యి

తయారీ విధానం:

  • బాణలిలో బియ్యం, పెసరపప్పు దోరగా వేగించుకోవాలి.
  • అందులో ఒకటికి రెండు నీరు లెక్కన వేసి, కొంచం జీలకర్ర కొద్దిగా మిరియాలు కూడా వేసి, కుక్కర్లో పెట్టాలి.
  • బాగా మెత్తగా ఉడికాక తియ్యాలి.
  • బాణలి లో నెయ్యి వేసి, అందులో జీలకర్ర, మిరియాల పొడి కొద్దిగా వేసి, అల్లం చిన్న ముక్క వేసి, కరివేపాకు తో పోపు వెయ్యాలి.
  • ఈ పోపుని, ఉప్పుని ఉడికించుకున్న అన్నం-పప్పు లో కలిపి, నెయ్యి వెయ్యాలి.

మరికొన్ని సులభంగా చేసే ఆహార పదార్థాలు  

  • బొంబాయి రవ్వ తో, అటుకులతో, ఓట్స్ తో, గోధుమ నూకతో రకరకాలుగా ఉప్మా, అందులో ఆలు, క్యారెట్, బఠాణీలు, వేసి మంచి ఆకర్షణీయంగా చేసి, పెట్టవచ్చు.
  • పూరి కూడా ఆకుకూరతో ఆకుపచ్చ రంగు లో చేసే తినిపించచ్చు.
  • ఎముకల బలానికి రాగి జావా చాలా మంచిది. మొలకెత్తిన రాగి గింజలు, దోరగా వేగించి, గ్రైండ్ చేసి, ఆ  పొడిని పాలతోనో, మజ్జిగ తోనో కలిపి ఇవ్వచ్చు.

పిల్లలికి ఆహారం ఇస్తున్నప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు

  • పిల్లలు సరిగ్గా తినటల్లేదనే ఆవేదన సాధారణంగా చాలా మందికి ఉంటుంది. పిల్లలికి  వ్యాయామం, అంటే, పాకటం, ఏదైనా పట్టుకుని నడవడం, కాళ్ళు చేతులు బాగా ఆడించడం, ఇలాంటివి చేస్తే ఆకలి వేస్తుంది.
  • పిల్లల జీర్ణాశయం, మిగతా అంగాలన్నీ ఇంకా పూర్తిగా ఎదిగి ఉండవు గనుక, ఘన పదార్థాలు చాలా కొంచెం (ఒకటి, రెండు  చెంచాలు) తో మొదలెట్టాలి. పళ్ళ విషయానికొస్తే, అరటిపండులో చిన్న ముక్క మాత్రమే తినిపించాలి.
  • చంటి పిల్లలలో  ఆకలి, మలవిసర్జనం రెండు సవ్యంగా జరుగుతున్నాయో లేదో గమనించాలి.
  • తినిపించే పదార్ధం లో పెద్ద ఉండలు, గట్టి పదార్ధాలు ఉండకూడదు. పిల్లలకి మింగటం రాక, గొంతులో ఇరుక్కుని డోక్కునేట్టు చెయ్యచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి.
  • బిస్కకెట్స్, బేకరీ ఫుడ్స్ అతి తక్కువ ఇవ్వటం మంచిది. సన్న జంతికలు, తియ్యని చిక్కి, పనీర్, పచ్చిక్యారెట్ ముక్క లాంటివి సరదాగా ఇవ్వచ్చు.
  • వాళ్ళు ఏమేమి ఇష్టంగా తింటున్నారు అన్నది గమనించాలి. ఒక సారి తినకుండా ఉమ్మేశారని, ఊరుకోకుండా, రెండు రోజులు ఆగి మళ్ళీ ప్రయత్నించాలి. పిల్లలకి రుచిని తెలిపే టేస్ట్ బడ్స్ ఆరు నెలలకి వృద్ధి అవుతాయి. కొత్త కొత్త రుచులకి వాళ్ళు ముందే ఇష్ష్టం చూపించరు.
  • పిల్లలకి విధిగా రకరకాల  పళ్ళు అలవాటు చెయ్యాలి. పళ్లలోని విటమనులు, పీచు పదార్ధం జీర్ణ క్రియ కి బాగా పనికి వొస్తుంది.

ఒక సంవత్సరం నిండిన పిల్లలకి ఆటలపై ద్యాస వల్ల పెట్టిన ఆహారం తినడానికి బాగా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళని బెదిరించకుండా, కేకలేసి,  హంగామా చెయ్యకుండా, ఓపిగ్గా, కబుర్లు చెపుతూ, తినిపించాలి. వాళ్ళ ఇష్టాఇష్టాలని కూడా కనిపెట్టాలి. అది పెద్ద ఛాలెంజ్ అమ్మలకి. నిరుత్సాహపడకుండా ప్రయత్నించాలి. తన పిల్లలికి ఎంత పెట్టాలి అన్నది అంచనా తల్లికి తెలిసిపోతుంది.

మీ సలహా లు, సూచనలు తప్పకుండా కామెంట్ రూపం లో తెలపండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles