గర్భం ధరించటం ఎలా?

Written by
Last Updated on

మీరు తల్లి కావాలనుకుంటున్నారా? తల్లి కావాలన్న కోరిక వచ్చినప్పటి నుంచి ఎంత త్వరగా ఆ కోరిక తీరుతుందా అనిపించటం చాలా సహజం. కానీ శరీరాన్ని గర్భధారణకి అనువుగా ఉంచుకోవాలి.

ఆరోగ్యంగా ఉంటే చక్కని పిల్లలకి తల్లి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తలిద్దరికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటే, పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉంటే, గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.

కొన్ని సూత్రాలు పాటించడం వల్ల మీరు త్వరగా గర్భం ధరించగలరు. ఆ సూత్రాలు ఏంటో ఈ మోంజుంక్షన్ లేఖ లో తెలుసుకోండి.

త్వరగా గర్భం ధరించడం ఎలా: మీరు పాటించాల్సిన 5 సూత్రములు

ఈ క్రింది పద్ధతులు పాటించడంవలన మీకు త్వరగా గర్భం పొందే అవకాశం ఉండవచ్చు:

1. కుటుంబ నియంత్రణ సాధనాలన్నీ మానెయ్యాలి

గర్భం ధరించాలన్న ఆలోచన రాగానే , ముందుగా కుటుంబనియంత్రణ మందులు వాడటం మానెయ్యాలి. కుటుంబనియంత్రణ మాత్రలు మానేసినా, వాటి ప్రభావం వెంటనే పోదు. కొత్త మార్పులకి శరీరం స్థిరపడడానికి రెండు-మూడు నెలలు పట్టవచ్చు. త్వరగా గర్భం ధరించడానికి ఈ విషయం ఎంతో ముఖ్యం.ఇది కరెక్ట్ గా తెలిస్తే , గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.

2. గర్భధారణకి అనువైన రోజులు గుర్తించాలి

భార్యా భర్తలు ఎన్నిసార్లు కలిసినా, సరిగ్గా అండం విడుదలయ్యే ముఖ్యమైన రోజుల్లో సంభోగం జరగకపోతే గర్భధారణ జరగదు. చాలా మంది డాక్టార్లు OPK పద్దతి, చార్ట్ పద్దతి, బేసల్ బాడీ టెంపరేచర్ వంటివి వాడమని సలహా ఇస్తారు.

  • OPK (ovulation prediction kit) ద్వారా ల్యూటినైజింగ్ హార్మోన్ (LH) ఎప్పుడు విడుదల అవుతుందో మూత్ర పరీక్షలో తెలుస్తుంది. తెలిసినప్పటినుంచి నాలుగు-ఐదు రోజులు గర్భ ధారణకి అనువైన రోజులు.
  • రుతుక్రమం ఖఛ్చితంగా ఉన్న వారికి (28 రోజులు), సాధారణంగా 14వ రోజున అండం ఉత్పత్తి అవుతుంది. కావున, 14వ రోజు మరియు దానికి ముందు నాలుగు రోజుల్లో సంభోగం చేస్తే గర్భవతి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది (1).

3. అనువైన భంగిమ, సరిఅయిన సమయము తెలుసుకోవాలి

ఫలానా భంగిమ మంచిదన్నది ఖచ్చితంగా చెప్పలేము. కానీ కొన్ని భంగిమలలో వీర్య కణాలు స్త్రీ లోపలికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  • స్త్రీ వెల్లకిలా పడుకుని రతి జరిపితే, యోని లోని పల్లము వల్ల వీర్యం మొత్తం లోపలికి పోయి,అండం వైపు పరుగు తీస్తుంది.
  • రాత్రి పడుకునే ముందు మంచి టైం అని కొందరు, ఉదయం స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది కనుక, ఆ సమయం మంచిదని రెండు వాదాలు వున్నాయి. ఏది ఏమైనా మీకు తోచిన టైం ఉత్తమం.
  • రతి జరిగాక, కనీసం పది నిమిషాలు అలాగే పడుకుని ఉండాలని డాక్టర్ల ఉద్దేశ్యం. రతి జరిగిన వెంటనే స్త్రీలు వేడి నీటితో స్నానం మానుకుంటే మంచిది. శరీరం లో వేడి పెరిగి, సంతానోత్పత్తి ప్రక్రియ దెబ్బతినవచ్చు.
  • భావప్రాప్తి ఉంటే సంతృప్తి కరమైన సంపర్క మని, దానివల్లే గర్భ ధారణ జరగడానికి అవకాశాలు ఎక్కువని అంటుంటారు. కానీ ఈ విషయం రుజువు కాలేదు.

4. పరిక్ష కి సిద్ధం కండి

ప్రగ్నన్సీ టెస్ట్ లో ఎంత త్వరగా మీరు తల్లి కాబోతున్నారని తెలిస్తే, అంతత్వరగా డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఋతు చక్రం తప్పిన 5-7 రోజులలో మీరు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకుని, మీరు గర్భవతా కాదా అని తెలుసుకోవచ్చు. మూత్రం లో HCG (హ్యూమన్ చోరియోనిక్ గొనడోట్రోపిన్) లెవెల్ ని కనిపెట్టి గర్భం వొచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.

5. పైన చెప్పిన గర్భధారణ టెస్ట్ నెగిటివ్ అయితే?

ఈ నెల టెస్ట్ లో గర్భధారణ లేనట్టు వస్తే, నిరాశ పడ కూడదు. కొంత మందికి గర్భం ధరించుటకు ఆరు నెలలనుంచి ఒక సంవత్సరం కూడా పట్టవచ్చు. మీ సారవంతమైన రోజులను సరిగ్గా లెక్కించుకుని మళ్ళీ ప్రయత్నించండి.

పైన వివరించిన జాగ్రత్తలు తీసుకుంటే, త్వరగానే గర్భ ధారణ సాధ్యం అవుతుంది. మానవ ప్రయత్నానికి ఆ ప్రకృతి కూడా దీవిస్తుంది.

గర్భం ధరించడానికి చిట్కాలు

గర్బంధరించటానికి ముందుగా అనుకూల పరిస్తుతులు కల్పించుకోవాలి. ఈ క్రింది చిట్కాలు మీకు గర్భధారణ లో సహాయపడవచ్చు:

  1. ఒత్తిడిని దూరంగా ఉంచండి: మీ ఇంట బోసినవ్వుల పాపాయి రావాలంటే ముందుగా మనసులోని స్ట్రెస్ని తీసివెయ్యాలి. ఒత్తిడి, వేదన, టెన్షన్ని తరిమేయాలి. స్త్రీలోఅండంవిడుదలవడం, స్పెర్మ్తో కలసి పిండంగా మారడం వగైరాలన్నీ మెదడు ఇచ్చే సిగ్నల్స్ వల్లనే జరుగుతుంది. మరి ఆ మెదడులో అక్కర్లేనివిచారాలు, నెగిటివ్ ఆలోచనలు ఉంటే హార్మోన్ల విడుదల సరిగ్గా ఉండదు. మనసుని హాయిగా, ఆనందంగా ఉంచుకుంటే ఆశించిన ఫలితాలువస్తాయి.
  1. ఆరోగ్యం మీద ధ్యాస పెట్టండి: డాక్టర్ని సంప్రదించి, ఒంట్లో ఏ సమస్యా లేకుండా చూసుకోవాలి. గర్భధారణ ముందు అవసరమైన విటమిన్స్, ఫోలిక్యాసిడ్మాత్రలు డాక్టర్సలహాపైవాడాలి.
  1. పౌష్ఠిక ఆహారము, నిద్ర: మంచిపౌష్టికాహారం, మంచినిద్ర చాలా అవసరం. జంక్ఫుడ్, మసాలాలు తగ్గించి తినండి. సిగరెట్, మత్తుపదార్ధాలు ఇలాంటివి అలవాటుంటే, మానివేయ్యండి. సిగరెట్ పొగ కాలుష్యం నుంచి దూరంగా ఉండండి.
  1. వ్యాయామం: రోజు కొద్ది కొద్దిగా వ్యాయామం చెయ్యండి. కానీ అతిగా వ్యాయామం చేయటం మంచిది కాదు,ముఖ్యముగా మగవారికి. యోగా చాలా ఉపకరిస్తుంది.
  1. వేడి నీళ్ల స్నానం: స్త్రీలు సంభోగమైన వెంటనే వేడినీళ్లతో స్నానం చేయరాదు. ఆలా చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి, గర్బం ధరించే అవకాశాలు తగ్గవచ్చు.
  1. శరీర బరువు అదుపులో పెట్టండి: అతి బరువు ఉన్న స్త్రీలు బరువు తగ్గితే వాళ్ళు గర్భవతి అయ్యే అవకాశాలు మెరుగు పడతాయి.

అన్నిటి కన్నా తల్లి కావాలనే కోరిక బలంగా ఉండటం చాలా ముఖ్యం. ఒక పండంటి పాపాయి కి తల్లిదండ్రులు కావాలి అని ఆత్రుత పడడం చాలా సహజం. కానీ మీరు ఒక్క నెలలోనే గర్భం ధరించగలరా?

ఒక నెలలో గర్భ ధారణ జరగాలంటే?

సరిగ్గా అండం విడుదల అయ్యే ముందు రతి జరపాలి. అండం విడుదలై ఫెలోపియన్ ట్యూబ్ (fallopian tube) లో స్పెర్మ్ కోసం వేచిఉండేది కేవలం 24 గంటలు మాత్రమే. కానీ స్పెర్మ్ 50 గంటలు నిలువగలదు (2). అండం విడుదలవగానే, ఫెలోపిన్ ట్యూబ్ లో వీర్య కణాలు వేచి ఉంటే, తప్పక విజయ కలుగుతుంది.

  • సగటు పీరియడ్ 28 రోజులనుకుంటే 14 వ రోజున అండం విడుదల జరుగుతుంది.
  • పీరియడ్ అయిన వారం తరువాత తరచూ రతి లో పాల్గొనటం మంచిది.
  • పీరియడ్ అయిన 10వ రోజునించీ ప్రతి రోజు రతి లో పాల్గొన టం మంచిది, ప్రత్యేకించి మీ పీరియడ్ రెగ్యులర్ కానప్పుడు.
  • లేదా OPK లో 12వ రోజు సూచించినట్టయితే, ఆ రోజు, తరువాత రెండు-మూడు రోజులు తప్పకుండా రతి లో పాల్గొనడం వలన గర్భ ధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ఆరోగ్యవంతమైన గర్భం కోసం పౌష్ఠిక ఆహారం తినడం భార్యాభర్తలిద్దరికీ కూడా చాలా అవసరం.

గర్భధారణ కొరకు తీసుకోవలసిన ఆహారం

మనం తినే ఆహారం ఒక వైపు ఆరోగ్యం చేకూరుస్తూ మరోవైపు గర్భ ధారణకి సహకరించేటట్టు ఉండాలి. మీ రోజువారీ భోజనంలో ఈ క్రింది బలవర్ధకమైన ఆహారాన్ని చేర్చండి (3) (4):

  • పాల కూరలో అండోత్పత్తికి,స్పెర్మ్ వృద్ధికి కావలసిన జింక్ ధాతువు బాగా ఉంది.
  • అరటి పండులో విటమి న్ B6 హార్మోన్ల విడుదలకి బాగా ఉపయోగపడుతుంది.
  • గుడ్లు, బలవర్ధక మైన పప్పు ధాన్యాలు శరీరానికి కావలసిన విటమిన్, ప్రోటీన్లు ని అందిస్తాయి.
  • బీన్స్ , గింజలు (nuts ), పప్పు ధాన్యాలు గర్భం ధరించేందుకు సానుకూలమైన పోషకాలని అందిస్తాయి.

పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ, పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీకు గర్భధారణ త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటి తో పాటు మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచుకొనుటకు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు.

సహజం గా స్పెర్మ్ కౌంట్ ని పెంచుకోవటం ఎలా?

ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం వలన స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉండవచ్చు:

  • సిగిరెట్, మద్యం, మత్తు పదార్ధాలు (drugs) మానివెయ్యాలి.
  • శరీర బరువుని నియంత్రించాలి.
  • జింకు, విటమిన్ C మరియు ఫోలిక్ ఆసిడ్ వాడితే, స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది.
  • మరీ వేడి నీటి టబ్ లో స్నానం, సోనా బాత్ మంచిది కాదు ఎందుకంటే వేడి స్పెర్మ్ ని నాశనం చేస్తుంది.

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?

గర్భధారణ ప్రయత్నాలు మొదలెట్టి ఒక సంవత్సరం పైన అయినా విజయవంతం కాకపొతే, తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి. వారు అవసరమైన పరీక్షలు చేసి, సరైన కారణాలు కనుక్కొని, నివారణ తెలుపుతారు.

ఆరోగ్యమైన జంట అసలు ఇవేమీ పట్టించుకోకుండా ఫ్రీ గా రతిలో పాల్గొన్నా కనీసం ఒక సంవత్సరం లోగా గర్భం ధరించవచ్చు . అందువల్ల ౩౦ వయసు లోపు వాళ్ళు నిశ్చితంగా ఉండవచ్చు. మనసు ప్రశాంతంగా, ఆహ్లాదం గా ఉంచుకోవటం చాలా మంచిది.

ఈ చిట్కాలు అవగాహన చేసుకుని ఆశించిన టైం లో గర్భం ధరించి,ఆరోగ్యమైన పాపాయికి తల్లి కాగలరు. అల్ ది బెస్ట్!!

మీ కామెంట్స్ ని క్రింది కామెంట్స్ బాక్స్ లో తెలియచేయండి.

ప్రస్తావనలు:

1. Khandis Blake and Amon Rapp; Relationship Between the Menstrual Cycle and Timing of Ovulation Revealed by New Protocols: Analysis of Data from a Self-Tracking Health App; Journal of Medical Internet Research (2017)
2. Boris B. Rubenstein, Hermann Strauss, Maurice L. Lazarus, and Henry Hankin; Sperm Survival in Women – Motile Sperm in the Fundus and Tubes of Surgical Cases
3. Follow The Fertility Diet? Harvard health Publishing, Harvard Medical School
4. Foods That Can Affect Fertility; Academy of Nutrition and Dietetics, US

 

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles