పిల్లలకి నేర్పించే చిన్న పాటలు (రైమ్స్)

Written by Vijaya phani
Last Updated on

చందమామను చూస్తే మైమరచి పోతారు, వాన కురిస్తే కేరింతలు కొడతారు, కథలు వింటూ ఆదమరచి నిద్రపోతారు…  బాల్యం అంటే ఇంతే మరి. బుడి బుడి అడుగులు వేస్తూ, చిన్ని చిన్ని కబుర్లు చెప్పే బుజ్జాయిలకు ఇల్లే తొలి బడి.  తెలుగు గడపల్లో ఏనాటి నుంచో వినిపిస్తున్న తెలుగు రైమ్స్ ఇక్కడ మోంజుంక్షన్ మీకు అందిస్తున్నాం.

1. చిట్టి చిలకమ్మా

చిట్టి చిలకమ్మా –   అమ్మకొట్టిందా ?
తోటకెళ్ళావా?   –   పండుతెచ్చావా?
గూట్లోపెట్టావా?  –  గుటుక్కుమింగావా?

2. చిట్టి చిట్టి మిరియాలు

చిట్టిచిట్టిమిరియాలుచెట్టుకిందపోసి
పుట్ట  మన్నుతెచ్చి, బొమ్మరిల్లుకట్టి,
బొమ్మరింట్లో పిల్ల పుడితే
బొమ్మ తలకు నూనె లేదు
అల్లంవారింటికిచల్లకిపోతే.
అల్లంవారికుక్కభౌభౌమంది,
నా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమన్నవి
చంకలోని పిల్ల క్యార్ క్యార్ మన్నది

3. చందమామ రావే

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే – గోగు పూలు తేవే
బండెక్కి రావే- బంతి పూలు తేవే,
తేరు మీద రావే-  తేనే పట్టు తేవే
పల్లకీలో రావే- పాలు పెరుగు తేవే,
పరుగెత్తి రావే – పనస పండు తేవే
అన్నిటినీ తేవే- మా పాపకిచ్చి పోవే
మా పాపకిచ్చి పోవే!!

4. చిన్ని విత్తనమ్ము

చిన్ని విత్తనమ్ముభూమి క్రిందను
నిద్ర పోయే నిద్రా ! నిద్ర పోయెను!
వాన బొట్టులన్నీ దాని మీదను
ఝల్లు ఝల్లు వానా జల్లి పోయెను
అందుకా గింజా- ఆవలించుచూ
అటు ఇటు నూగి -దుంకి లేచెను.

5. కాకి కాకి

కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలో ముంచి
గంగా నాకు నీళ్లను ఇచ్చే
నీళ్లను తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలను తెచ్చి అవ్వకు ఇస్తే
అవ్వ నాకు జున్ను ఇచ్చే
జున్ను తెచ్చి పంతులుకిస్తే
పంతులు నాకు చదువు చెప్పే
చదువును తెచ్చి మామకు ఇస్తే
మామ నాకు పిల్లని ఇచ్చే
పిల్ల పేరు మల్లె మొగ్గ
నా పేరు జమీందారు
నా పేరు జమీందారు

6. చమ్మ చక్క

చమ్మ  చక్క  – చారడేసి మొగ్గ
అట్లు పోయంగా- ఆరగించంగా
ముత్యాల చమ్మ  చక్క ముగ్గులేయంగా
రత్నాల చమ్మచక్కరంగులెయ్యంగా
పగడాల చమ్మ చక్క పందిరేయంగా
పందిట్లో అమ్మాయి పెళ్లి చేయంగా

7. చేత వెన్నముద్ద

చేత వెన్నముద్ద- చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు – పట్టు దట్టి
సందె తాయెతులను  – సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా – నిన్ను చేరి కొలుతు

8. కుక్కకి మాంసము

కుక్కకి మాంసము దొరికినది
అది వంతెన మీదకి పోయినది
నీటిలో తన నీడని చూసినది
వేరో కుక్కని తలచింది
భౌ భౌ భౌ వ్వని అరచినది,
ఉన్నది కాస్తా ఊడినది

9. తెలుగు అంకెలు

ఒకటి – ఓ చెలియా
రెండు – రోకళ్ళు
మూడు – ముత్యాలు
నాలుగు- నందన్న
ఐదు  – జవ్వాది
ఆరు  – చిట్టి గొలుసు
ఏడూ – బేడీలు
ఎనిమిది – ఎనమందా
తొమ్మిది  – తోకుచ్చు
పది – పట్టెడ

10. తప్పట్లోయ్ – తాళాలోయ్

తప్పట్లోయ్ – తాళాలొయ్
దేవుడి గుడిలో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు ,ఉగ్గు పాపడుకోయ్
తప్పట్లోయ్ – తాళాలొయ్
దేవుడి గుడిలో బాజాలోయ్

11. కాళ్ళా గజ్జె – కంకాళమ్మ

కాళ్ళా గజ్జె – కంకాళమ్మ
వేగు చుక్క – వెలగా మొగ్గా
మొగ్గా కాదు – మోటానీరు
నీరు కాదు – నిమ్మల బావి
బావి కాదు – బచ్చలి కూర
కూరా కాదు – గుమ్మడి పండు
పండు కాదు -పాపా కాదు
కాలు తీసి – కడగా పెట్టు
కామాక్షమ్మా……

12. ఛల్ ఛల్ గుర్రం

ఛల్ ఛల్ గుర్రం – చలాకి గుర్రం
రాజు  ఎక్కే రంగుల గుర్రం
రాణి ఎక్కే జీలుగుర్రం
రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం
ఛల్ ఛల్ గుర్రం – చలాకి గుర్రం

13. ఉడతా ఉడతా ఉఛ్!

ఉడతా ఉడతా ఉఛ్ -ఎక్కడికెళ్లావోచ్
కొమ్మమీద జామపండు కోసుకొస్తావా
మా పాపాయి కిస్తావా

14. ఏనుగమ్మ ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు – ఏఊరొచ్చిందేనుగు?
ఏనుగమ్మ ఏనుగు – మా ఊరొచ్చిందేనుగు
ఏనుగు ఏనుగు నల్లానా- ఏనుగు కొమ్ములు తెల్లానా
ఏనుగు మీదా రాముడు – ఎంతో చక్కని దేముడు !!
ఏనుగమ్మ ఏనుగు – ఏ ఊరెళ్లిందేనుగు?

15. వానా వానా వల్లప్పా!!

వానా వానా వల్లప్పా
వాకిలి తిరుగు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగాలేనే నర్సప్ప

16. చుక్ చుక్ రైలు

చుక్చుక్రైలువస్తోంది- దూరందూరంజరగండి
ఆగినాకాఎక్కండి- జోజోపాపాఏడవకు
లడ్డుమిఠాయితినిపిస్తా- కమ్మటిపాలుతాగిస్తా

17. ఒకటి ఒకటి రెండు

ఒకటిఒకటిరెండు- వేళకు బడికిరండు
రెండుఒకటిమూడు- ఒకరికి ఒకరు తోడు
మూడుఒకటినాలుగు-కలిసిమెలిసిమెలుగు
నాలుగుఒకటిఅయిదు  -చెడ్డవారికిఖైదు
ఐదుఒకటిఆరు  – న్యాయంకోసంపోరు
ఆరుఒకటిఏడు- -అందరిమేలు చూడు
ఏడూఒకటిఎనిమిది-  భారతదేశంమనది
ఎనిమిదిఒకటితొమ్మిది- కమ్మనిమనసుఅమ్మది
తొమ్మిదిఒకటిపది  – చదువేమనకిపెన్నిధి

18. బుర్రు పిట్ట బుర్రు పిట్ట

బుర్రు పిట్ట బుర్రు పిట్ట  – తుర్రుమన్నది
పడమటింటి కాపురం చెయ్యనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మొగుడి చేతి మొట్టికాయ  తింటానన్నది

19. మా తాత అందం

మా తాత అందం – చందమామ చందం
మా తాత  గుండు – గుమ్మడి పండు
మా తాత మీసం – రొయ్యల మీసం
మా తాత పిలక – పంచదార చిలక
మా తాత అందం – చందమామ చందం
మా తాత కర్ర – నడ్డి వెదురు కర్ర
మా తాత కళ్ళు – నేరేడు పళ్ళు
మా తాత పళ్ళు – దానిమ్మ గింజలు
మా  తాత మాట – చద్దిమూట
మా తాత నవ్వు –  తెల్లని పువ్వు
మా తాత మనసు – మాకెంటో  తెలుసు
మా తాత అనుభవం – మాకెంతో వరం
మా తాత కోపం – మాకెంతో భయం

20. బావ బావ పన్నీరు

బావ బావ పన్నీరు – బావని పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పారు – వీసెడు గంధం పూశారు
సావడి గుంజకి కట్టేరు -చప్పిడి గుద్దులు గుద్దేరు

21. ఏనుగమ్మ ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు – ఎంతో పెద్ద ఏనుగు
నల్లానల్లని ఏనుగు – తెల్ల కొమ్ముల ఏనుగు
చిన్ని కళ్ల ఏనుగు – చేట చెవుల ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు – ఎంతో మంచి ఏనుగు
చిన్న తోక ఏనుగు – పొడుగు తొండం ఏనుగు
షికారుకెళ్లే ఏనుగు – దీవెనలిచ్చే ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు – ఎంతో చక్కనిఏనుగు

22. పాపాయి కన్నులు

పాపాయి కన్నులు కలువ రేకులు
పాపాయి జుబ్బాలు పట్టు కుచ్చులు
పాపాయి దంతాలు మంచి ముత్యాలు
పాపాయి చేతులు చిట్టిపొట్ల కాయలు
పాపాయి పాదాలు తమలపాకులు
పాపాయి చెక్కిళ్ళు పసి వెన్నముద్దలు
పాపాయి వన్నెలు పసి నిమ్మముద్దలు
పాపాయి పలుకులు పంచదార చిలకలు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెలు
పాపాయి నవ్వులు సన్నజాజి పువ్వులు
పాపాయి బుగ్గలు బొండు మల్లె మొగ్గలు
పాపాయి అడుగులు తీయనైన అరిసెలు
పాపాయి చేష్టలు నేతి పూత రేకులు
పాపాయి అల్లరి చల్లని అంబలి
పాపాయి అరుపులు కమ్మనైన మురుకులు
పాపాయి అలకలు వేడివేడి పుణుకులు

23. తారంగం తారంగం

తారంగం తారంగం – తాండవ కృష్ణా తారంగం
వేణునాధా తారంగం – వెంకటరమణా తారంగం
వెన్నదొంగ తారంగం- చిన్నికృష్ణ తారంగం

24. బుజ్జి మేక బుజ్జి మేక

బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివి?
రాజుగారి తోటలోన మేతకెల్తిని
రాజుగారి తోటలోని ఏమి చూస్తివి?
రాణిగారి  పూలచెట్ల సొగసు చూస్తిని
పూలచెట్లు  చూసినీవు ఊరుకుంటివా?
ఊరుకోక ,పూల చెట్లు మేసి వస్తిని
మేసి వస్తేతోటమాలి ఏమి చేసెను?
తోటమాలి కొట్టవస్తే, తుర్రు మంటిని!

మన అమ్మమ్మల కాలం నాటి తెలుగు రైమ్స్ ఇవన్నీ. పిల్లలకు చదువును పరిచయం చేయడం ఇలాంటి తెలుగు రైమ్స్ తో ప్రారంభిస్తేనే మంచిదంటారు పెద్దలు. ఇలాంటి చిన్న తెలుగు పాటలతో మీకున్న అనుభవాలను, అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. కింది కామెంట్స్ బాక్సులలో ఆ అనుభవాలను మాతో పంచుకోండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles