కుంకుమ పువ్వు – ఉపయోగాలు

Written by
Last Updated on

ఎన్నో సంస్కృతులలో పురాతన కాలం నుంచి ఓ నమ్మకం పాతుకు పోయింది. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వల్ల పుట్టే బిడ్డలు తెల్లగా ఉంటారన్నది ఆ నమ్మకం సారాంశం. ఇది నమ్మశక్యం కానప్పటికీ, ఇంట్లోని పెద్దవాళ్ళు కుంకుమ పువ్వును పాలు లేదా ఇతర ఆహారంలో కలిపి తినమని గర్భిణీ స్త్రీలకు సలహా ఇస్తూనే ఉంటారు.

కాబట్టి, గర్భధారణ సమయంలో మహిళలు కుంకుమ పువ్వు ఎందుకు తినాలి? దీనివల్ల ప్రయోజనాలు కలుగుతాయనడానికి ఏమైనా నిరూపితమైన ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలతో పాటూ గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వల్ల కలిగే లాభనష్టాలూ, సురక్షితమైన పద్దతిలో తినేందుకు కొన్ని చిట్కాలను ఇక్కడ మామ్ జంక్షన్ మీకు తెలియజేస్తుంది.

గర్భంతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు తినడం సురక్షితమేనా?

ఖరీదైన కుంకుమపువ్వును గర్భిణులు తీసుకోవటం ప్రమాదం కాదు, కానీ తక్కువ మోతాదు లోనే తీసుకోవాలి. డ్రగ్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ చెప్పినదాని ప్రకారం, అధిక మొత్తంలో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భాశయం సంకోచించడం, థ్రోంబోసైటోపెనియా, రక్తస్రావం, గర్భస్రావం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది (1).

గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల శిశువు తెల్లగా పుడుతుందని కొంతమంది నమ్ముతారు (2). దీనికి శాస్త్రీయంగా ఆధారాల్లేవు. అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తినాలని ఎంతోమంది ప్రజలు సిఫారసు చేయడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

కుంకుమ పువ్వుతో శిశువుల రంగు మెరుగవుతుందా?

నిజం చెప్పాలంటే, శిశువుల చర్మం రంగు వారి తల్లిదండ్రుల జన్యువుల ఆధారంగా ముందే నిర్ణయించబడుతుంది. కుంకుమ పువ్వు వల్ల బిడ్డలు తెల్లగా పుడతారనడానికి ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు తినడం వల్ల ప్రయోజనాలున్నాయా?

కుంకుమ పువ్వు ని తక్కువ మోతాదులో గర్భిణులు సేవిస్తే, దానిలోని ఔషధ గుణాల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

1. జీర్ణక్రియ

ఇరానియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ మెడికల్ సైన్సెస్‌ 2013 లో ప్రచురించిన ఒక సర్వేలో , కుంకుమపువ్వులోని ఔషధ గుణాలు జీర్ణ కోశాన్ని శుభ్రపరచడం , రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఆకలిని పెంచటంతో పాటు జీర్ణక్రియకు సహాయ పడతాయి (3) (4).

2. రక్త పోటు(బిపి)

ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో కుంకుమపువ్వులో ఉన్న క్రోసిన్, సఫ్రానల్‌ లకు రక్తపోటును నియంత్రించే లక్షణాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు (5).

3. నొప్పులు, తిమ్మిర్లు

సాధారణంగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, పెరుగుతున్న బిడ్డ కోసం స్థలం కల్పించే ప్రక్రియ లో కండరాలు, ఎముకలు విస్తరిస్తాయి. దీని వల్ల కీళ్లలో, పొట్టలో నొప్పి, తిమ్మిరిగా అనిపించ వచ్చు. కుంకుమ పువ్వు లోని నొప్పిని నివారించే లక్షణాలు గర్భిణీ కి నొప్పులు , తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. (6) (7)

4. నిద్ర

గర్భిణుల్లో కొందరికి రాత్రి సరైన నిద్ర పట్టక అవస్థ పడుతుంటారు. పడుకోబోయే ముందు పాలతో కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుంటే, అందులో ఉండే ఉపశమన, హిప్నోటిక్ గుణం వల్ల హాయిగా నిద్ర పడుతుంది (8).

5. ఉత్సాహపరచడం

గర్భధారణ సమయంలో ఆందోళన, మిశ్రమ భావోద్వేగాలు కలగడం సహజం. యాంటీ-డిప్రెసెంట్ గా పిలవబడే కుంకుమపువ్వు మీ మానసిక స్థితిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది (1).

6. గుండెకి మెరుగైన ఆరోగ్యం

ఇరాన్ లో చేసిన ఒక సమీక్ష ప్రకారం, కుంకుమ పువ్వులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, ధమనులు, రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి (9).

7. సులువైన ప్రసవం

కుంకుమ పువ్వు గర్భాశయ సంకోచాలను ప్రభావితం చేస్తుంది. అందుకని ప్రసవం సమయంలో దీన్ని తీసుకుంటే, ప్రసవంలోనిశ్రమను తగ్గించడానికి, సులువుగా అయ్యేందుకు ఇది సహాయపడుతుందని నమ్ముతారు (10).

కుంకుమ పువ్వు కషాయం గర్భిణులు తీసుకోవటం ఎంతవరకు సురక్షితం ?

కుంకుమపువ్వు కషాయం చాలా చిక్కగా ఉంటుంది. దాన్ని ప్రజలు ఒత్తిడి తగ్గించుకోడానికి, బరువు తగ్గించుకోడానికి, స్వీట్స్ తినాలనే అతి వాంఛని తగ్గించుకోడానికి వాడతారు. అయితే, గర్భణిగా ఉన్నప్పుడు కషాయం సురక్షితమో కాదో చెప్పే శాస్త్రీయ పరిశోధనలు లేవు. అందువల్ల, క్రోసిన్, సఫ్రానల్ సమ్మేళనాలు అధికంగా ఉన్నందున కషాయాన్ని తీసుకోకపోవడమే మంచిది.

గర్భిణిగా మీరు కుంకుమపువ్వు ఎప్పుడు తీసుకోవచ్చు?

ఇతర వైద్య విధాన డాక్టర్లు (హోమియోపతి, అక్యూపంక్చర్…) చెప్పినదాని ప్రకారం గర్భిణులు ఐదో నెల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. అప్పటికే గర్భంలో శిశువు కదలడం ప్రాంభమవుతుంది, అలాగే గర్భం నిలబడుతుంది.

మహిళలు సాధారణంగా రోజుకు కేవలం రెండు రేకల కుంకుమపువ్వు (20 నుండి 30 మిల్లీగ్రాములు) తీసుకుంటారు. దీని కంటే ఎక్కువ పరిమాణంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

గర్భిణిలలో కుంకుమ పువ్వు వల్ల కలిగే దుష్ప్రభావాలు

ఎక్కువ మోతాదులో కుంకుమ పువ్వు తింటే , అది మేలు చేయకపోగా కీడు చేస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాం.

1 . నెలలు నిండకుండానే ప్రసవం లేదా గర్భస్రావం

పైన చెప్పినట్టు కుంకుమపువ్వు అతిగా తినడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం, అలాగే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందుకే, మోతాదు మించకుండా చూసుకోవటం ముఖ్యం (11).

2. ఇతర ఫలితాలు

కొందరిలో కుంకుమపువ్వు అతిగా తింటే మత్తు, వాంతులు, విరోచనాలు, రక్తస్రావం జరిగే ప్రమాదం చాలా ఉంది.

గర్భిణులు కుంకుమపువ్వు తినేందుకు వివిధ మార్గాలు

మీ ఆహారంలో కుంకుమ పువ్వుని చేర్చే ముందు తప్పక డాక్టర్ ని సంప్రదించండి.

  • సాధారణంగా గర్భిణులు ఒక గ్లాసు పాలతో కొన్ని కుంకుమ పువ్వు కాడలు వేసి తాగడం తెలిసిన పద్దతే. పాలతో పాటు మిగతా పాలపదార్థాలలోను కలుపుకొని తాగవచ్చు
  • వంటకం రుచిని పెంచడానికి ఇది ఫ్లేవర్ ఏజెంట్‌గా కూడా ఉపయోగించబడుతుంది. సూప్ లు, రైస్ లలో, డెసెర్ట్ లలో కుంకుమపువ్వు కాడలను కలుపుతారు.

పాలు లేదా ఇతర ఆహార పదార్థాలలో కుంకుమపువ్వును ఉపయోగించే రెండు సాధారణ పద్ధతులు…

నానబెట్టడం: కుంకుమపువ్వు కాడలను మెత్తగా చూర్ణం చేసి, వెచ్చని పాలు లేదా నీటిలో కలుపుతారు. ఇలా 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాకా,పాలు లేదా ఏదైనా వంటకానికి కలుపుతారు.

నలపడం: సన్నని కుంకుమపువ్వు రేకలు వేళ్ళతో విడదీసి, ఏదైనా వంటకంలో వేస్తారు

మీరు డాక్టర్ అనుమతితో కుంకుమ పువ్వు తీసుకునేట్టయితే,మంచి ఉత్తమ శ్రేణి కుంకుమ పువ్వుని ఎంచుకోవాలి.

కుంకుమ పువ్వును ఎంపిక చేసుకోవడానికి, నిల్వ చేయడానికి కొన్ని చిట్కాలు

  • కుంకుమ పువ్వు ఖరీదైనది కాబట్టి, కల్తీ లేని కుంకుమ పువ్వును పొందవచ్చు. ప్రభుత్వ ఆమోదం పొందిన, నాణ్యమైన ట్రేడ్‌మార్క్‌లను కలిగి ఉన్న బ్రాండ్ లేదా స్టోర్ నుండి మాత్రమే కొనండి.
  • లేబుల్, తయారీదారుడెవరో, గడువు తేదీలను (Expiry dates) తనిఖీ చేయండి.
  • స్వచ్ఛమైన కుంకుమ పువ్వు మృదువుగా, నారింజ-ఎరుపు చివరలతో రక్తవర్ణంలో ఉంటుంది. అత్యధిక గ్రేడ్ రకానికి చెందినది అయితే చాల ముదురు రంగులో ఉంటుంది. కల్తీవి తెలుపు లేదా పసుపు రేకలతో రక్తవర్ణంలో ఉంటాయి.

గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వును చాలా తక్కువ పరిమాణంలో (మిల్లీగ్రాములలో) తీసుకుంటే ప్రమాదకరం కాదు. ఇది పదార్థం రుచిని పెంచి ఆకలి పుట్టించేలా చేస్తుంది. అయితే దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

మీలో ఎవరైనా గర్భిణీ గా ఉన్నప్పుడు కుంకుమ పువ్వు ని వాడిన అనుభవం ఉందా? ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి కింది కామెంట్స్ రూపంలో.

References

1. Mohammad J. Siddiqui et al.; Saffron (Crocus sativus L.): As an Antidepressant; J Pharm Bioallied Sci (2018)
2. Sreetama Chakrabarti and Abhik Chakrabarti; Food taboos in pregnancy and early lactation among women living in a rural area of West Bengal; J Family Med Prim Care (2019)
3. Behjat Javadi et al.; A Survey on Saffron in Major Islamic Traditional Medicine Books; Iran J Basic Med Sci (2013)
4. Mansoureh Gorginzadeh and Mansoureh Vahdat; Smooth muscle relaxant activity of Crocus sativus (saffron) and its constituents: possible mechanisms; Avicenna J Phytomed. (2018)
5. Zohreh Nasiri et al.; Dietary saffron reduced the blood pressure and prevented remodeling of the aorta in L-NAME-induced hypertensive rats; Iran J Basic Med Sci (2015)
6. Amin Mokhtari-Zaer et al.; Smooth muscle relaxant activity of Crocus sativus (saffron) and its constituents: possible mechanisms; Avicenna J Phytomed (2015)
7. Hossein Hosseinzadeh; Saffron: A Herbal Medicine of Third Millennium; Jundishapur J Nat Pharm Prod (2014)
8. Sasan Andalib et al.; Sedative and hypnotic effects of Iranian traditional medicinal herbs used for treatment of insomnia; EXCLI J (2011)
9. Kamalipour M and Akhondzadeh S; Cardiovascular effects of saffron: an evidence-based review; J Tehran Heart Cent (2011)
10. Hasan Badie Bostan et al.; Toxicology effects of saffron and its constituents: a review; Iran J Basic Med Sci (2017)
11. Roghaieh Sadi et al.; Effect of Saffron (Fan Hong Hua) On the Readiness of The Uterine Cervix In Term Pregnancy: A Placebo-Controlled Randomized Trial; Iran Red Crescent Med J (2016)
Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles