పిల్లల కోసం 15 చిన్న నీతి కథలు

Written by
Last Updated on

 

కథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హృదయాలలో మంచి నడవడి ని గురించి, ధర్మా ధర్మాల గురించి, చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు.

పిల్లలికి కథలంటే ఎంతో ఇష్టం. కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోయే అవకాశం ఎక్కువే.

మామ్ జంక్షన్ మీ కోసం ఆసక్తి కరమైన తెలుగు చిన్న కథలని, స్నేహం గురించి నీతి కథలని సమీకరించి, మీ పిల్లలకి కథలు చెప్పాలన్నప్పుడు వీలుగా మీకు ఇక్కడ అందజేస్తున్నది.

15 చిన్న నీతి కథలు

మొదటిగా, మనం ఒక చాలా చిన్న నీతి కథ చూద్దాం.

1. నాలుగు ఆవులు

Four cows
Image: Shutterstock

ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.

కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.

ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.

నీతి: ఐకమత్యమే బలం.

2. ఏనుగు – స్నేహితుల

Elephant - friends
Image: IStock

ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ, కోతుల గుంపుని చూసి, “మీరు నాతొ స్నేహం చేస్తారా?” అని అడిగింది.

కోతులు, “అబ్బో! నువ్వెంత పెద్దగా ఉన్నావో? మా లాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు,” అన్నాయి.

ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. “హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా?” అని ఆశగా అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్, నాలాగా చిన్న బొరియలలో, కన్నాలలో దూరగలవా? మనకి స్నేహం ఎలా కుదురుతుంది?” అంది.

ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్నికూడా స్నేహం కోసం అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు. నీతో స్నేహం కుదరదు,”అని చెప్పింది.

దారిలో నక్క కనిపిస్తే, దానిని కూడా అడిగి, కాదనిపించుకుంది. ఈలోగా, అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి. “ఏమైంది? అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగింది. “అయ్యో పులి జంతువుల్ని వేటాడుతోంది.” అని చెప్పి పారిపోయాయి. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులి కెదురుగా నిలబడి, “దయచేసి నా స్నేహితులని చంపద్దు,” అంది.

“నీ పని నువ్వు చూసుకో …నీ కెందుకు వాళ్ళ గోల?” అంది పులి. తన మాట వినేట్టు లేదని, ఏనుగు పులి ని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడినించి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. “నీ ఆకారం సరైనదే. ఇప్పట్నించీ నువ్వు మా అందరి స్నేహితుడివని ” ఎంతో మెచ్చుకున్నాయి.

నీతి : స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం,ఆకారం లో ఉన్నా స్నేహం స్నేహమే!

3. నిజమైన స్నేహితులు

True friends
Image: IStock

శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణ వృద్ధి చెంది,పెరిగి,సంపన్నుడైనాడు. కానీ సుధామ బీదతనంతో చిన్న గుడిసె లోనే తన భార్య,పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పారిస్తుతులొచ్చాయి.

అంత సుధామ భార్య, కృష్ణుడి వద్దకి వెళ్లి, సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గిరకెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డువచ్చిన, వాటిని పక్కనపెట్టి, తెగించి ద్వారకకి వెళ్ళాడు.

సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైనా అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్య పడ్డాడు.రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ, అవతారం చూసి ,లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం, అంటే, సుధామ వొచ్చి,తన ద్వారం దగ్గిర వేచిఉన్నాడన్న మాట విని కృష్ణ్ణుడు మహా ఆనందపడి, చేస్తున్న పని ఆపేసి, ఆత్రంగా పరిగెత్తి వొచ్చి, సుధామని ఆప్యాయంగా కౌగలించుకుని, లోపలికి ఆహ్వానించాడు స్వయంగా. అంతేకాదు చాలా ప్రేమగా, గౌరవంగా, సుధామ కాళ్ళు కడిగి, తన పక్కనే కూర్చోబెట్టుకుని, చిన్ననాటి మధురస్మృతుల్ని తలుచుకుని నవ్వుకున్నారు.

అంత గొప్పగా ఉన్న రాజు, శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడి కి తాను తెచ్చిన అటుకులు ఇవ్వవడానికి సిగ్గు పడి వెనక్కి దాచేసాడు సుధామ. అది గమనించిన కృష్ణుడు, అడిగి మరీ చేతిలోంచి తీసుకుని, మూట విప్పి తినసాగాడు.

శ్రీకృష్ణుని ప్రేమకి, ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచేసాడు. వొచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి, కళకళ లాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, సహాయం అడగలేదు, అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏమి కావాలో ఇచ్చేసాడు. అదే నిజమైన స్నేహమంటే, అని అనుకుని మురిసిపోయాడు.

నీతి : నిజమైన స్నేహితులకి అంతస్తు తో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం.

4. నలుగురి స్నేహితులు

Four friends
Image: IStock

ఒక కాలేజ్ లో నలుగురు స్నేహితులున్నారు. వాళ్లకి చదువు అంటే ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీ కెళ్ళి, మర్నాడు పరీక్షరాయకుండా, తిన్నగా కాలేజ్ పెద్ద దగ్గిరకెళ్ళి, “నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంటే, కార్ టైరు పంచేరైంది. దానిని తోసుకుంటూ వొచ్చేసరికి బాగా అలిసి పోయాము, ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు,” అని కల్పించి ఒక కథ చెప్పారు.

కాలేజ్ పెద్ద, “సరే, పరీక్ష వొచ్చేవారంలో రాయమని చెప్పాడు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని బోల్తా కొట్టించామనుకుని తెగ సంతోషించారు.

తరువాత వారం పరీక్షకి సిద్ధం అయి వచ్చారు. వాళ్ళ నలుగురిని విడి విడి క్లాసుల్లో కూర్చోమని వాళ్లకి ఒకటే ప్రశ్న పత్రం ఇచ్చారు. అందులో రెండే రెండు ప్రశ్నలున్నాయి 1౦౦ మార్కులకి:

నీపేరు:

ఏ టైరు పంక్చర్ అయింది?

దీనికి, ఒక్కో స్నేహితుడు ఒక్కో సమాధానం ఇలా రాసారు: 1. కుడి వైపు టైరు 2. ఎడమ వైపు టైరు ౩. వెనుక కుడి టైరు 4. వెనుక ఎడమ టైరు.

నీతి: నీకు నువ్వు చాలా తెలివైనవాడివనుకోవచ్చు …కానీ నిన్ను మించిన వాళ్ళు ఉంటారు.

5. నాన్నా, అదిగో తోడేలు

Dad its a wolf
Image: Shutterstock

ఒకానొక గుట్ట మీద చిన్న పల్లెటూరు. ఒక రైతు, తన చిన్న కొడుకుని గొర్రెలు కాయటానికి తనతో తీసుకెళ్లాడు. పిల్లవాడిని గొర్రెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే వెంటనే అరవమని చెప్పి, రైతు కొద్ది దూరంలోఉన్న తన పొలం లో పని చేసుకోడానికి వెళ్ళాడు.

కొంతసేపటికి ఆ పిల్లాడికి ఏమీ తోచలేదు. నాన్నా వాళ్ళని ఆటపట్టించాలని ,”బాబోయ్ తోడేలు, అదిగో తోడేలు,” అంటూ గట్టిగా అరిచాడు. అది వింటూనే ఖంగారుగా రైతు, మిత్రులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకొచ్చి, “ఏది తోడేలు?” అని అడిగారు. పిల్లాడు పక పక నవ్వుతు, “అబ్బె , ఉత్తినే అరిచా!” అన్నాడు. “ఇలా ఉత్తిత్తినే అరవకు. మా పని పాడుచెయ్యకని” మందలించి రైతు వెళ్ళిపోయాడు.

కాస్సేపటికి మళ్ళీ కొంటె గా, “బాబోయ్ తోడేలు” అని పెద్దగా అరవటం, మళ్ళీవాళ్ళంతా కర్రలతో పరిగెట్టుకు రావటం, పిల్ల వాడు మళ్ళీ పెద్దగా నవ్వుతూ “బ్బే !ఉత్తినే అరిచా” అనటం జరిగిపోయింది. “ఇలా ఆకతాయి పనులు చేస్తే నిన్ను ఎవ్వరు నమ్మరు” అంటూకేకలేసి మళ్ళీ తమ పనిలో నిమగ్నమయ్యారు.

కాస్సేపట్లో నిజంగానే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రె పిల్ల మీద కి దూకింది. కుర్రాడు భయంతో గట్టిగా “నాన్నా! బాబోయ్ తోడేలు గొర్రెని చంపేస్తోంది, రండి తొందరగా రండి,” అంటూ పెద్దగా ఆరవ సాగాడు. “ఈ ఆకతాయి పిల్లడు మళ్ళీ అరుస్తున్నాడు,” అని వాణ్ని పట్టించుకోలేదు రైతు. తోడేలు గొర్రె పిల్లని నోటకరుచుకుని అడవిలోకి ఈడ్చుకు పోయింది. పిల్లాడు ఒక పొద పక్కన కూర్చొని భయంతో ఏడుస్తూ కనిపించాడు.

పని ముగించుకుని వచ్చిన రైతు కొడుకు ఏడుస్తూ ఉండటం చూసి, “ఎందుకు ఏడుస్తున్నావని?” అడిగాడు. తండ్రిని చూడగానే “తోడేలు వచ్చిందని గట్టిగా అరచినా మీరెందుకు రాలేదు, తోడేలు గొర్రె పిల్లని చంపి ఎత్తుకు పోయింది. నేను భయంతో ఇక్కడ కూర్చుండిపోయా. ఎందుకు రాలేదు?” అన్నాడు కోపంగా. దానికి రైతు “అబద్దాలాడే వాడి మాట ఎవ్వరు నమ్మరు, పట్టించుకోరు,” అని చెప్పి ఓదార్చి, మిగిలిన గొర్రెలని తోలుకుని ఇద్దరూ ఇంటికి పోయారు.

నీతి: అబద్దాలాడేవాళ్ళని ఎవ్వరూ విశ్వసించరు. వాళ్ళు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.

6. బాతు – బంగారు గ్రుడ్డు

Duck and golden egg
Image: Shutterstock

ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.

కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతుల్లోకెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది .”ఈ బాతు రోజు ఒక గ్రుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గ్రుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అవ్వచ్చు గదా, దాని కడుపు కోసేసి ఆ గ్రుడ్లన్నీ తీసేసు కుంటాను” అని అనుకున్నాడు.

ఆ ఆలోచన రావటమే తడవుగా ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గ్రుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గ్రుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా, అని విచారించ సాగాడు.

నీతి: దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే మిగులుస్తుంది. పని చెసేముందే ఆలోచించాలి

7. మిడాస్ స్పర్శ

Midas Touch
Image: IStock

ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రాజు కి చాలా సంపద ఉంది. అతనికి ఒక చక్కని కూతురు కూడా ఉంది.

ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు లెక్కించుకుంటూ ఉండగా ఒక అదృష్ట దేవత ఎదురుగా కనపడింది. రాజు చాలా ఆదరించి, గౌరవించాడు. అతని మర్యాదలకి సంతోషించి ,అదృష్ట దేవత, ఏదైనా వరం కోరుకోమంది. ఆ రాజు అస్సలు ఆలోచించకుండా, “నేను ఏది నా చేతితో తాకితే, అది బంగారం గా మారాలని,” కోరాడు.

దేవత కి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని, కానీ అడిగాడని, కాదనక, రాజుకా వరం ఇచ్చేసింది. రాజు మహా సంతోషంతో, ఎదురుగా ఉన్న ఒక ఆపిల్ పండు ని ముట్టుకున్నాడు. అది వెంటనే మెరిసిపోతూ బంగారు పండు గా మారిపోయింది. ఇంకా వెర్రి ఆనందంగా రాజా భవనం లోని వొస్తువుల్ని బంగారు మయం చేస్తుండగా, అక్కడికి వాళ్ళమ్మాయి వొచ్చింది.

పరమానానందంతో గబా గబా వెళ్లి పట్టేసుకున్నాడు. అంతే, ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అదిచూసి రాజు ఏడుస్తూ, ఆ అదృష్ట దేవత కోసం ప్రార్ధించాడు. “నాకీ శక్తి వొద్దు. నా పిల్ల కి మామూలు రూపం రావాలని,” ప్రార్ధించాడు. బంగారంగా మారినవన్నీ మళ్ళీ యధా రూపం లోకి వొచ్చాయి. అమ్మాయిని చూసుకుని రాజు మురిసిపోయాడు. రాజుకి బుధ్ధి వొచ్చింది. తనకున్న దానితో హాయిగా, తృప్తిగా జీవించటం నేర్చుకున్నాడు.

నీతి: అత్యాశకి పోరాదు. మనకున్నదానిలో సంతృప్తి గా ఉండటం మంచిది.

8. ఒక పిసినారి కథ

The story of a pisinari
Image: IStock

ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాలని ఆ తోటలో రాళ్ళకింద గుంత లో దాచి, దాని పైన రాళ్లు పెట్టేవాడు. కానీ ప్రతి రోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యం గా ఆ బంగారు నాణాలని లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు.

ఒక రోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యం గా గమనిస్తున్న ఒక దొంగ, రోజు లాగే, బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచేవరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి, అతను లోపలికి వెళ్ళాక , గప్చిప్ గా నాణాలని దొంగిలించాడు. మర్నాడు ముసలి వాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఇంటిపక్కవాళ్ళు వొచ్చి, ఏమి జరిగిందని అడిగి, తెలుసుకున్నారు. “ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు. నువ్వేమిటి బైట, అదికూడా భూమిలో పెట్టుకున్నావు? దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలుకాదు కదా?” అన్నారు.

దానికి ఆ పిసినారి, “కొనుక్కోడామా? నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను. అది దాచుకోడానికి మాత్రమే,” అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంట లోకి విసిరి, “అలా అయితే, అదే నీ సొమ్మనుకో. నువ్వు వాడనప్పుడు దానికి విలువేదీ? రాయైనా, బంగారమైన ఒకటేగా. నువ్వు వాడనప్పుడు రెండు విలువ లేనివే,” అంటూ వెళ్ళిపోయాడు.

నీతి : ఉపయోగించని సొమ్ము ఉన్నా, లేకున్నా ఒకటే.

9. రైతు – బావి

Farmer and well
Image: IStock

ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు. నీటికోసం బావి దగ్గరకి వెళితే, పక్కవాడు, “నువ్వు బావి కొన్నావు కానీ నీళ్ళని కాదు. నీళ్లు ముట్టుకోడానికి వీలులేదని అడ్డుకున్నాడు. నిరాశతో ఉన్న రైతు ఏమి చెయ్యాలో తోచక, రాజా అక్బర్ దర్బార్ లోని మంత్రి తెలివైన బీర్బల్ దగ్గరకి వెళ్ళాడు.

అంతావిని, బీర్బల్ రైతుని, బావిని అమ్మిన వాడిని పిలిచాడు. నీళ్లు తీసుకోడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించాడు. మోసగాడైన వాడు, “నేను బావినేఅమ్మినాను కానీ అందులోని నీటిని కాదు,” అని జవాబు చెప్పాడు.

తెలివైన బీర్బల్, “అంతా బానేఉంది. నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావ్? త్వరగా నీరు తీసి, ఖాళీ చేసి, వాడి బావి వాడికి ఇచ్ఛేసేయ్,” అని ఆజ్ఞా పించాడు.

తనెంతో గొప్పగా ఉపాయం వేస్తే, అది మొదటికే మోసం వచ్చింది అని గ్రహించిన వాడు క్షమార్పణ చెప్పి, బుధ్ధితెచ్చుకున్నాడు.

నీతి: మోసం చెయ్యటం మంచిది కాదు. మోసం చేస్తే, ఎక్కడోఅక్కడ దెబ్బ పడిపోతుంది.

10. మనిషి – పిల్లి కధ

Man and the cat
Image: IStock

ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. “మ్యావ్, మ్యావ్” అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బైటకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ పిల్లికి అది అర్ధం కాక, మనిషి దగ్గిరకి రాగానే, చేతిమీద బరికింది, భయపడుతూ. ఇంకొక అతను ఇది చూసి, “పోనిలే అలాగే వదిలెయ్యి…అది జంతువు, దానికే ఎలా బైట పడాలో తెలిసిపోతుంది” అన్నాడు.

కానీ మొదటి అతను వదిలెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి, పిల్లిని ఆ చిక్కులోంచి రక్షించాడు. “అవును. పిల్లి జంతువే. దాని నైజం దాని జోలికి వచ్చినవాళ్లని గీరటం, గాయం చెయ్యటం. కానీ నేను మనిషిని. నా నైజం జాలి, దయ కరుణ,” అన్నాడు .

నీతి: నిన్ను అందరూ ఎలా ఆదరించాలనుకున్నావో, అలాగే నువ్వు ఎదుటివాళ్లని ఆదరించు. నీ మానవత్వపు విలువలు వదలకు.

11. చెడు అలవాట్లు

Bad habits
Image: Shutterstock

ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లని చూసి చాలా విచారించాడు. ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో విహారానికి తీసుకెళ్లాడు. అడవి దారిలో పిల్లవాడికి చిన్న చిన్న మొక్కలు చూపి, వాటిని పీకమన్నాడు. పిల్లాడు చాలా సులువుగా తీసేసాడు.

ఇంకా కొంత ముందుకెళ్లాక, కొంచం పెరిగిన మొక్కలని చూపి, “పీకగలవా?” అన్నాడు. వెంటనే, ఉత్సాహంగా పీకి చూపించాడు. ఇంకా ముందుకి వెళ్ళాక, పొదని మొట్ట పెరికించగలవా? అని అడిగాడు. కొంచం కష్టపడి అది కూడా ఎలాగో పెరికించాడు.

ఇంకా పెద్ద చెట్టు చూపి, దానిని పీకగలవా అని అడిగాడు. “నా వల్ల కాదన్నాడు.” “చూసావా మరి? మన అలవాట్లు ఇలాగే పాతుకుపోయాక పీకలేము. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లని వదిలెయ్యాలి. మంచి అలవాట్లని నాటుకోవాలి, పెంచుకోవాలి” అని ఉపదేశించాడు.

నీతి: చెడ్డ అలవాట్లని వదిలించుకోవటం కష్టం. మొదట్లోనే వాటిని వదిలిపెట్టాలి.

12.కుక్క – బావి కథ

Dog and a well story
Image: IStock

అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళోతిరుగు తుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి “మీరెవ్వరు ఈ బావి దగ్గరికి వెళ్ళ కండి, చాలా ప్రమాదం,” అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావిదగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జికుక్క, “అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి,” అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.

బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టింది. లోపల ఆ కుక్కప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్కనీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది.

ఆదారినే వెడుతున్న ఒకరైతు, “అయ్యో! కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం,” అని దాన్ని బయటికి తీసి రక్షించాడు.

నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించ వచ్చు కానీ ఎపుడు ధిక్కరించ గూడదు.

13.కోపాన్ని నిగ్రహించు కొనటం

anger
Image: Shutterstock

ఒక ఊళ్ళో, ఒక తండ్రి, కొడుకు ఉండే వారు. కొడుక్కి కోపం చాలా ఎక్కువగా ఉండటం గమనించి తండ్రి కొడుకుతో ఒక రోజు ఇలా అన్నాడు, “ఇదిగో! ఈ బస్తాడు మేకులు, ఈ సుత్తి తీసుకో. నీకు బాగా కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకుని సుత్తి తో ఈప్రహరీ గోడలోకి దిగెయ్యి.”

కుర్రాడు సరే అని చెప్పి కోపం వచ్చినప్పుడల్లా మేకునిగోడలోకి దిగెయ్యటం మొదలు బెట్టాడు. కొన్ని రోజులకి గోడంతా మేకులతో నిండిపోయింది. బస్టాడు మేకులు అయిపోయాయి. ఈ మేకులుకొట్టే క్రమంలో మెల్లగా రోజుకి కొట్టే మేకుల సంఖ్య తగ్గి రోజుకి ఒక మేకు కూడా కొట్టని పరిస్థితి వచ్చింది. ఈ విషయం గమనించిన తండ్రి సంతోషించి రోజుకొన్ని మేకులు పీకేయ్యమని చెప్పాడు.

కొడుకు రోజూ కొన్ని మేకులు పీకేస్తు మొత్తానికి మేకులన్నీ పీకేసి తండ్రికి చూపించాడు. తండ్రి మేకులుపీకేయ్యగా ఉన్నగోడలోని చిల్లులన్నీ చూపించి, “ఈ గోడని ఎంత రంగులు వేసినా ఈ కన్నాల వల్ల బాగు పడదు. అలాగే మనం మన కోపంతో ఎవరి మనసునైనా కష్టపెడితే, తరవాత మనం ఎంత కష్ట పడ్డా వాళ్ళ మనసుకి అయిన గాయాన్ని పూర్తిగా మాన్పలేము,” అన్నాడు.

నీతి: కోపం చాలా ప్రమాదకరమైన కత్తి వంటిది. ఒక మనిషి ని కత్తి తో గాయం చేస్తే, గాయం కొన్నాళ్ళకి మానవచ్చు కానీ దాని తాలూకు మచ్చ పోదు.

14.మంచి సహవాసం, చెడు సహవాసం

Good association and bad association
Image: IStock

ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషం గా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బైటకి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలని దొంగిలించాడు.

అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది.

ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “ఒరేయ్ మూర్ఖుడా! ఇక్కడెందుకు న్నావురా? నీ నాలుక తెక్కొస్తా!” అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది.

ఆశ్చర్య పోతూ, బోయవాడు నీలాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను కానీ అది మహా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు. “ఓహ్, బహుశా అది నా అన్న చిలుక అయ్యిఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యం లో ఉంటామో అలాగే తయారవుతాము,” అని అనుకుంది రామచిలుక.

నీతి: మంచి వాడివి కావాలనుకుంటే, మంచి వారి సాంగత్యం లో ఉండాలి.

15 . డంబాలు పలికే డబ్బారాయుడు !

The Boasting Man
Image: IStock

ఒక అతను రకరకాల ప్రదేశాలు సందర్శిస్తూ, కనపడిన వారికి తన గురించి తెగ గొప్పలు చెప్పుకుంటుంన్నాడు. ఓహ్! ఆ దేశం లో నేను ఇలా చేశా, అలా చేసా, నా విన్యాసాలు చూసి అందరూ డంగై పోయారు, వాళ్లకి నోటమాట రాలేదు. చాలాసేపు విస్మయం చెంది, ఆ తరువాత నన్ను తెగ మెచ్చుకున్నారు. నీలాగా ఇంకెవ్వరూ ఇలా చెయ్యలేరని తెగ మెచ్చుకున్నారని, ఒకటే డంబాలు, గొప్పలు, కోతలు కోస్తున్నాడు.

తను చెప్పే గొప్పలు వీళ్ళు నమ్మటల్లేదేమో అని అనుమానం వచ్చి, “కావాలంటే మెచ్చుకున్నసాక్షులు కూడా ఉన్నారు తెలుసా?” అన్నాడు.

అందులో ఒకడు , “సాక్షులు ఎందుకు గాని, నువ్వే మాముందు చేసి చూపిస్తే, సరిపోతుంది కదా?” అన్నాడు. అంతే, ఆ డంబాలు పలికేవాడు నెమ్మదిగా అక్కడినించి జారుకున్నాడు.

నీతి: సత్తా లేకుండా ఉత్తినే గొప్పలు చెప్పేవాళ్ళకి విలువ లేదు.

నీతులు అన్నవి జీవితం లో గుణ పాఠాలు. మనం జాగ్రత్తగా చూస్తే, ప్రతి కథలోనూ ఏదో ఒక మంచి నీతి దాగున్నట్టు తెలుస్తుంది. కధలోని నీతిని పిల్లలు నిజజీవితంలో తమ కుటుంబము,స్నేహితులతో వ్యవహరించేటప్పుడు ఆచరించే విధంగా చెపితే, నీతి కధలు మనకి , పిల్లలకి మంచి చేసినట్టే. మనకి కావాల్సినన్ని చిన్ని నీతి కధల సంపద ఉంది.

నీతి కథల మీద మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles