తెలుగు పొడుపు కధలు

Written by Vijaya phani
Last Updated on

పొడుపు కధలు తెలుగు జాతి కి సరదా సరదా గా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు.

నలుగురు కలిసినపుడు ఒకరినొకరు అడిగి, వారు ఆలోచిస్తుంటే, తమాషాగా జవాబులిచ్చి, నవ్వుకోడానికి పనికివస్తాయి. పిల్లల్లో లాజికల్ గా ఆలోచించే శక్తి ని ప్రేరేపిస్తుంటాయి. మామ్ జంక్షన్ ఇక్కడ అటువంటి పొడుపు కధలని, జవాబులతో సహా పొందుపరుస్తున్నాము. చదువుకుని మీరూ ప్రయోగించండి.

  1. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది
    మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
    జ. కవ్వం
  2. కిట కిట తలుపులు, కిటారి తలుపులు
    ఎప్పుడు మూసిన చప్పుడు కావు
    జ. కంటి రెప్పలు
  3. అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది
    వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు
    జ. మురళి
  4. చారల పాము, చక్కటి పాము
    నూతిలో పాము, నున్ననైనా పాము
    జ. పోట్లకాయ
  5. నాదశ్వరానికి లొంగని త్రాచు,
    నిప్పంటించగానే ఆడెత్స్తుంది
    జ. చిచ్చుబుడ్డి
  6. తొడిమ లేని పండు, ఆకు లేని పంట
    జ. విభూది పండు
  7. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు
    కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు
    పాకి పోవు చుండు, పాము కాదు
    జ. రైలు
  8. సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద
    అందరూ ఇష్టంగా ఆరగిస్తారు
    జ. అరటిపండు
  9. అడుగులున్నా కాళ్ళు లేనిది
    జ. గజం బద్ద (స్కేల్)
  10. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే
    జ. నక్షత్రాలు
  11. అంగుళం ఆకు, అడుగున్నర కాయ
    జ. ములక్కాయ
  12. అంగుళం గదిలో, అరవై మంది నివాసం
    జ. అగ్గిపెట్టె
  13. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు
    జ. జల్లెడ
  14. ఆ మనిషికి రెండే కాళ్ళు, ఏడు చేతులు
    జ. నిచ్చెన
  15. ఈ ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం
    జ. ముక్కు
  16. ఎందరెక్కినా విరగని మంచం
    జ. అరుగు
  17. ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు
    జ. పేలాలు (popcorn)
  18. ఎర్రని కోటలో తెల్లని భటులు
    జ. పళ్ళు (teeth)
  19. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది
    జ. కుర్చీ
  20. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు
    జ. కాకర కాయ
  21. కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు
    జ. నవారు మంచం
  22. కన్ను ఉన్నా తలలేనిది
    జ. సూది
  23. చారెడు కుండలో మానెడు పగడాలు
    జ. దానిమ్మ పండు
  24. చూస్తే ఒకటి, చేస్తే రెండు
    తలకు తోకకు ఒకటే టోపీ
    జ. పెన్ను
  25. చూస్తే గజి బిజీ, తింటే కరకర
    జ. జంతిక
  26. చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నది
    పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు.
    జ. సీతాకోక చిలుక
  27. ఎంతెంతో వింత బండి, ఎగిరి ఎగిరి పోయేసుమండీ!
    మండుతూ మండుతూ మాయమయ్యెను
    జ. రాకెట్ ఆకాశం లోకెళ్లింది
  28. నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ!
    జ. ఒంటె (ఎడారి ఓడ)
  29. హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దు
    ఎన్నడూ ఆడొద్దూసుమా!
    జ. అబద్దం
  30. దాని పువ్వు పూజకు పనికిరాదు,
    దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదు
    కానీ దాన్ని అందరూ కోరతారు
    జ. చింత పండు
  31. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను,
    చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తా
    జ. మైకు
  32. నాకున్నది ఒకే కన్ను, చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకు పోను!
    జ. సూది
  33. క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం
    జ. నల్ల చీమల దండు
  34. అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి
    జ. ఇయర్ బడ్స్
  35. యంత్రం కానీ యంత్రం
    జ. సాయంత్రం
  36. అరిచి గోల పెట్టె రాళ్లు?
    జ. కీచు రాళ్లు
  37. నగరాలూ, పట్టణాలు దాటేస్తుంది,
    ఎంతెంత దూరమైనా వెళుతుంది
    కానీ ఉన్నచోటు నించి కదలదు
    జ. రహదారి (మనసు)
  38. కొంచమైనా కాన రాని పసుపు, వొళ్ళంతా పులుపు,పైనేమో నునుపు?
    జ. నిమ్మ పండు
  39. దొంతర దొంతర దుస్తులు, బంగారు వన్నె జుట్టు
    కలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు
    జ. మొక్కజొన్న కంకి
  40. చక్కనమ్మ చిక్కినా అందమే
    జ. సబ్బు
  41. చేత్తో పారేసి, నోటితో ఏరుకునేవి?
    జ. అక్షరాలు
  42. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి
    జ. పలక
  43. ఒక స్తంభానికి నలుగురు దొంగలు
    జ. లవంగం
  44. కానరాని విత్తనం, ఘనమైన చెట్టు
    జ. మర్రిచెట్టు
  45. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక
    జ. మిరప పండు
  46. తెల్లని పోలీసుకి నల్లని టోపీ
    జ. అగ్గిపుల్ల
  47. గాడి నిండా రత్నాలు, గదికి తాళం
    జ. దానిమ్మ పండు
  48. ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది
    జ. చెప్పులు
  49. అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు
    జ. పేరు
  50. నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే, లేచి కూర్చుంటా
    ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు
    జ. అగ్ని
  51. నీటిలో ఉంటే ఎగసిపడతాను
    నేలమీద మాత్రం కూలబడతాను
    జ. కెరటం
  52. వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను
    చీకటి పడితే మాయమౌతాను
    జ. నీడ
  53. నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు
    జ. సమయం
  54. కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను.
    తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని?
    జ. బొగ్గు
  55. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను
    ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని?
    జ. రామ చిలుక
  56. నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు
    ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు
    ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని?
    జ. ప్రపంచ పటం (మ్యాప్)
  57. నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని?
    జ. స్పాంజి
  58. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు
    జ. శబ్దం
  59. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు.
    జ. కంచం
  60. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను
    మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా
    జ. బ్లాక్ బోర్డు
  61. నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు
    జ. చెప్పులు
  62. ఒక ఇంటిలో ఒక పిల్ల, ఆ ఇంటికి కిటికీలు, తలుపులు లేవు. విరగ్గొట్టుకునే బైటికి రావాలి. మళ్ళీ లోపలి పోలేదు. ఏమిటది?
    జ. కోడిగుడ్డు
  63. తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది
    జ. పుట్టగొడుగు
  64. నన్ను వేసే వాళ్ళే గాని తీసేవాళ్ళు లేరు …నేను ఎవరిని?
    జ. గోడకి సున్నం
  65. అమ్మ కోసి ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది. తినటం పూర్తవగానే ఆకుపచ్చ రంగుకోచ్చింది. ఏమిటది?
    జ. పుచ్చకాయ
  66. ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చుస్తే, మరొకటి నలుపునే చూస్తుంది.
    జ. ఆకాశం (రాత్రి, పగలు)
  67. నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను,పెరిగి ఎర్రగా మారతాయా, చివరికి నల్లగా ఉంటా
    నాతొ కళ్ళని పోలుస్తారు
    జ. నేరేడు పళ్ళు
  68. గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది. గడగడా త్రాగుతుంది
    కళ్ళు మూసుకుని, తననెవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు
    జ. పిల్లి
  69. అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారికాని వచ్చే దారే లేదు
    జ. జల్లెడ
  70. చీకటి లో వెలిగే చిరు దారి
    జ. పాపిట
  71. ఒకటే తొట్టె, రెండు పిల్లలు
    జ. వేరు సెనగ
  72. ఎర్రటి పండుపై ఈగైనా వాలదు
    జ. నిప్పు కణిక
  73. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు
    జ. ఉల్లిపాయ
  74. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు
    అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు
    జ. మద్దెల
  75. చుస్తే చిన్నోడు, వాడి ఒంటినిండా నారబట్టలు
    జ. టెంకాయ
  76. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి
    జ. ఉంగరం
  77. పోకంత పొట్టి బావ, కాగంత కడవ మోస్తాడు
    జ. పొయ్యి
  78. కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు
    జ. కొబ్బరికాయ
  79. అడ్డ గోడ మీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు, అటు పక్క పడదు
    జ. ఆబోతు మూపురం
  80. అయ్యకు అందవు, అమ్మకి అందుతాయి
    జ. పెదవులు
  81. అది లేకపోతె, ఎవ్వరూ ఏమీ తినరు
    జ. ఆకలి
  82. అనగా అనగా అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీస్తే, మేక
    జ. మేనక
  83. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు
    నవ్వితే నవ్వింది కానీ పళ్ళు, నోరు లేవు
    తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు
    జ. అద్దం
  84. పైన చుస్తే పండు, పగుల గొడితే బొచ్చు
    జ. పత్తికాయ
  85. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి
    . దీపం
  86. పోకంతా పొట్టోడు, ఇంటికి గట్టోడు
    జ. తాళం కప్ప
  87. అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేన మామని?
    జ. చందమామ
  88. చిటపట చినుకులు చిటారి చినుకులు ఎప్పుడు రాలిన చప్పుడు కావు
    జ. కన్నీరు
  89. ఆకాశం లో అరవై గదులు. గదికో సిపాయి, సిపాయికో తుపాకీ
    జ. తేనెపట్టు
  90. ఆ ఆటకత్తె ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది
    జ. నాలుక
  91. ఆ కొండకు, ఈ కొండకు ఇనప సంకెళ్లు
    జ. చీమల దండు
  92. ఆకలేయదు, నీరుతాగదు, నేలని పాకదు ..ఏమిటా తీగ?
    జ. విద్యుత్తు తీగ
  93. తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది
    జ. ఉత్తరం
  94. తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది
    జ. ముళ్ల మొక్క
  95. ఆకాశాన పటం, కింద తోక …
    జ. గాలి పటం
  96. ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా తరగదు
    జ. పొగ
  97. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
    జ. కల్లు కుండలు
  98. నామముంది కానీ పూజారి కాదు, వాలముంది కానీ కోతి కాదు
    జ. ఉడుత
  99. సినిమా హాల్ కి మనతో వస్తుంది, టికెట్టు తీసుకుంటుంది కానీ సినిమా చూడదు, మనం వచ్చేవరకు ఎదురుచూస్తుంది
    జ. మన వాహనం
  100. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది.
    జ. ఉప్పు
  101. శివరాత్రి కి జీడికాయ, ఉగాదికి ఊరగాయ
    జ. మామిడి పిందె

ఈ చిన్న పొడుపుకథలు ఎన్ని చెప్పిన పిల్లలు ఇంకా చెప్పమని అడుగుతూనే ఉంటారు. మీరు కూడా కొన్ని సామెతలు సొంతంగా తయారు చెయ్యటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ కనిపించే ఏ వస్తువు అయినా మీరు ఒక పొదుపు కథలా మార్చవచ్చు. ఏమంటారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles