సుమతీ శతకంలో ఆణిముత్యాలు!

Written by Vijaya phani
Last Updated on

ఎన్నో ఏళ్ల అనుభ‌వ‌సారాన్ని కేవ‌లం నాలుగంటే నాలుగే పాదాల్లో పాఠ‌కుల‌కు అందిచేదే ప‌ద్యం. వేమ‌న త‌రువాత అంతే స్థాయిలో ప్ర‌సిద్ధి చెందిన ప‌ద్యాలు సుమ‌తీ శ‌త‌కంలోనివి. వేమన కాలానికి ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజల నోళ్ల‌పై నానాయి సుమ‌తీ శ‌త‌క ప‌ద్యాలు.

బ‌ద్దెన అని పిలువ‌బ‌డే భ‌ద్ర భూపాలుడు అనే వ్య‌క్తి వీటి వ్యాస‌క‌ర్తగా చెబుతారు. మ‌హాభార‌తాన్ని అనువ‌దించిన తిక్క‌న క‌వికి ఈయ‌న శిష్యుడ‌ని అంటారు. సుమతి అంటే, మంచి బుద్ధి కల వాడా! అని. మన చిన్నారులకి ఇవి నేర్పిస్తే, వారి బుద్ధి చక్కగా వికసిస్తుంది. మామ్ జంక్షన్, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దే తల్లితండ్రులకు, ఇక్కడ కొన్నిపద్యాలని సుమతీ శతకం నుంచి అందిస్తోంది.

1. శ్రీరాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ!

శ్రీరాముని దయవలన అందరు జనులు ఔరా అని ఆశ్చ‌ర్య‌ప‌డేట్టుగా న్యాయమును భోధించు నీతులను చెబుతాను.

2. అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

అవస‌రానికి పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెర‌వేర్చని భగవంతుడిని, యుద్ధసమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్ర‌న్ని వెంటనే విడిచిపెట్టవలయును.

3. అడిగిన జీతంబీయని

మిడిమేలపు దొరను గొలిచి మిడుకుట కంటెన్
వడిగల ఎద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

అడిగినప్పుడు జీతము ఇవ్వ‌ని గర్వియైన య‌జ‌మాని ద‌గ్గర ప‌నిచేయ‌డం కంటే, నాగలికి వేగంగా ప‌రుగెత్తే ఎద్దుల‌ను కట్టుకొని పొలాన్ని దున్నుకొని వ్యవసాయము చేసుకుని బ‌త‌క‌డం ఉత్త‌మం.

4. అప్పిచ్చు వాడు, వైద్యుడు

నెప్పుడు నెడతెగక పాఱు నేఱు ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడనట్టి యూరు చొరకుము సుమతీ!

అవసరానికి అప్పు ఇచ్చే స్నేహితుడు,రోగం వచ్చినప్పుడు వైద్యం చేసే వైద్యుడు, ఎండిపోకుండా ఎల్లప్పుడూ పారే ఏరు, శుభాశుభాలకు కర్మలు చేయించే బ్రాహ్మణుడు ఉండే ఊరిలో ఉండుము. ఈ సౌకర్యములు లేని ఊరిలో నివశింపకుము.

5. ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ ,వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!

లోకంలో ఉపకారికి ఉపకారం చేయటం సర్వ సాధారణం. కానీ అపకారిని క్షమించి, ఉపకారం చేయువాడు ఉత్తముడు.

6. ఎప్పటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ

ఏ సమయంలో ఏమి మాట్లాడితే సరిపోతుందో సరిగ్గా ఆలోచించి, దానికి తగినట్లుగా ఇతరులను బాధ పెట్టకుండా, తానూ బాధ పడకుండా సమయోచితంగా మాట్లాడి వ్యవహారాల్ని పరిష్కరించే వాడే వివేకవంతుడు.

7. ఎప్పుడు సంపద కలిగిన

నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ చెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

చెరువులో నిండుగా నీరు చేరినప్పుడు పదివేల కప్పలు చేరినట్టు, మనకు సంపదలు కలిగి సంవృద్ధిగా ఉన్నప్పుడు బంధువులు వచ్చి చేరుతారు.

8. ఒక యూరికి నొక కరణము

నొక తీర్పరియైన గాక ,నొగి దఱుచైనన్‌
గకవికలు గాకయుండునె
సకలంబు గొట్టువడక సహజము సుమతీ!

ఒక ఊరికి ఒక క‌ర‌ణ‌ము, ఒక ధ‌ర్మాధికారి ఉన్నట్లయితే ఆ ఊరు క్రమపద్ధతిలో ఉంటుంది .అట్లా కాక ఎక్కువమంది ఉన్నట్లయితే, గంద‌ర‌గోళం ఏర్ప‌డి సక‌లం చెడిపోతుంది.

9. ఓడల బండ్లను వచ్చును

ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లను వలెనే
వాడంబడుఁ కలిమిలేమి వసుధను సుమతీ!

నీరు లేని చోట ఓడలు బండ్ల మీద భూమార్గంలో ప్రయాణిస్తాయి. బండ్లు నీటిమార్గంలో ఓడలమీద ప్రయాణిస్తాయి. అట్లే ఐశ్వర్యము కలిగినప్పుడు పదిమందికి పెట్టిన వాడు ,లేమి వచ్చినప్పుడు ఇతరులపై ఆధారపడి నడచును . ఇది లోక సహజము.

10.కనకపు సింహాసనమున

శునకము గూర్చుండఁబెట్టి శుభలగ్నమునన్
దొనరఁగ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను? వినరా సుమతీ!

కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు సింహాస‌నం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నీచ‌ గుణమును ఎలా మాన‌లేదో, అల్పుడైన వ్య‌క్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టినంత మాత్రాన వాడి నీచ స్వభావం విడువడు.

11. కమలములు నీట బాసిన

కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పిన
తమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతీ!

క‌మ‌లపూలు త‌మ నివాస‌మైన నీటిని విడిచి పెడితే, అప్ప‌టివ‌ర‌కు మిత్రుడైన సూర్యుని ఎండ‌కే క‌మిలిపోతాయి. అలాగే మ‌నుషులు త‌మ నివాసాలు విడిచిపెడితే స్నేహితులే శ‌త్రువుల‌వుతారు.

12. కూరిమి గల దినములలో

నేరము లెన్నడును కలుగనేరవు , మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

స్నేహమున్న రోజులలో ఎదుటివారిలో తప్పులు కనబడవు. అదే స్నేహము వికటిస్తే , ఎదుటివారు ఏమి చేసినను తప్పులుగానే కనపడును. అందుచేత, మనసును సవ్యమైన మార్గంలో నడిపించుకొనుట, మంచి స్నేహమును వృద్ధి చేసికొనుట సజ్జనుల లక్షణాలు.

13. కొరగాని కొడుకు పుట్టిన

కొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
జెరకునఁ దీపెల్ల జెఱచు సిద్దము సుమతీ !

అప్రయోజకుడైన కుమారుడు పుట్టినచో, తానూ పనికి మాలిన వాడుగుటయే కాక తండ్రి సద్గుణములను కూడా చెడగొట్టి, వానిని గూడా దుర్జనుని చేయును. చెరకు గడ చివర వెన్ను పుట్టినచో, చెరకుగడలోని తీపినంతనూ పాడుచేయును గదా!

14. చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ!

చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.

15. చేతులకు దొడవు దానము,

భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియే తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

చేతులకు దానమే అలంకారము, రాజులలో ఆడిన మాట తప్పక, నిజాయితీగా ఉండటమే అలంకారము. లోకములో ఎవరికైననూ ధర్మముగాని, మృదువుగా ప్రవర్తించుట అలంకారము. స్త్రీకి పాతివ్రత్యమే అలంకారము.

16. తనకోపమే తన శత్రువు,

తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము,
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ!

తన కోపమే తన‌కు శ‌త్రువులా మారుతుంది. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.

17. తనయూరి తపసితనం మును,

తన పుత్రుని విద్య పెంపు, తన సతి రూపూన్
తన పెరటి చెట్టు మందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తన గ్రామములో ఎవడైనా నిష్టా పరుడై, చేయు తపమును, తన కొడుకు చదివేది పెద్ద చదువులను, తన భార్య చక్కనిదైనను, దాని యందచందములును, తన పెరటి చెట్టుతో తయారయిన మందుని, చాలా గొప్పవని మానవులెవ్వరును భావించారు.

18. తల యందు విషము ఫణికిని

వెలయంగా దోకనుంచు వృశ్చికమునకున్
తలాతోకా యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

పామునకు విషము కోరలలోనే ఉండును. తేలునకు తోక చివర కొండెలోనే ఉండును. కానీ దుర్జనుడైన వానికి శ‌రీర‌మంతా విషము వ్యాపించి ఉండును అందుచేత వీడు పాము కన్నా, తేలు కన్నా మహా ప్ర‌మాద‌క‌రం.

19. నయమున బాలుం ద్రావరు

భయమును విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోషకారియో
భయమేల చూపంగ వలయు బాగుగా సుమతీ!

నెమ్మదిగా జెప్పినచో మంచి పని యైననూ చేయుటకు ప్రజలు నిరాకరిస్తారు. అదే భ‌య‌పెడితే మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన‌దైనా కూడా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. కావున భయమే గుణము నిచ్చును.

20. నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లి తండ్రి నాధులతోడని
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

నిండు సభలో కూర్చున్నప్పుడు కారణం లేకుండా నవ్వకూడదు. తల్లి, తండ్రి, యజమానులతో పరిహాస ప్రసంగములు చేయకూడదు. పరస్త్రీలతో తగినంత వరకే గాని హాస్య ప్రసంగములు చెయ్యరాదు . వేదవేత్తలైన బ్రాహ్మణుల నెప్పుడునూ ఎగతాళి చేయరాదు.

21. నీరే ప్రాణాధారము

నోరే రసభరితమైన నుడువుల కిర ఉం
నారే నరులకు రత్నము
చీరే శృంగారమండ్రు, సిద్దము సుమతీ!

జీవులకు ప్రాణాల‌కు నిల‌బెట్టే ఆధారం నీళ్లే. నవరసములు మాటలాడుటకు నోరే ప్రధానం. మనుషులలో స్త్రీయే శ్రేష్ఠురాలు. అలంకారములన్నిటిలోను చీరదే అందం.

22. పాలను గలిసి జలములు

బాల విధంబునన్ యుండు బరికింపంగా
బాల చావిన్ జెఱచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

నీళ్లు పాలలో గలిసినప్పుడు పాల వలెనేది కనబడును గాని పాల రుచిని మాత్రము పాడు చేయును. అట్లే దుర్మార్గుని చేరదీసినచో వాడు మంచి వాని వలెనె నటించును కానీ అసలు మంచి వానిని పాడుచేయును.

23. పిలువని పనులకు బోవుట

కలయని సతి రతియు, రాజు కానని కొలువుఁ
పిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయ వలదుర సుమతీ!

పిలువని పనులకు పోవరాదు. మనసులు కలియని స్త్రీతో కలవరాదు. రాజు గురుతించని కొలువుచేయరాదు. పిలువని పేరంటమునకు పోరాదు. మనసులలో ఆప్యాయాత లేని స్నేహాన్ని చేయరాదు.

24. పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జనమించినపుడే పుట్టదు, జనులా
పుత్రుని గనుఁగొని పొగడగ
బుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతీ!

తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగడం సాధారణమే. అయితే, ఆ కుమారుడిని చూసి పదిమంది ప్రజలూ మెచ్చుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది.

25 .పనిచేయునెడల దాసియు ,

నానుభవమున రంభ, మంత్రి యాలోచనలన్
దానభుక్తి యెడల దల్లియు
ననదగు కులకాంత లోకమందున సుమతీ!

ఇంటి పనులు చేయుటలో దాసి గాను, భర్త కు సౌఖ్యమిచ్చుటలో రంభగాను, సత్కార్యాచరణము చేయుటలో ఆలోచనలను చెప్పు మంత్రిగాను భోజనము పెట్టుటలో తల్లిగాను వ్యవహరించే స్త్రీ, మంచి వంశమున బుట్టిన ఇల్లాలు అనిపించుకొనును.

26. బలవంతుడ నాకేమని

బలువురితో విగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలి చీమలు చేత చిక్కి చావదె సుమతీ!

మహాబలవంతుడిన‌ని విర్ర‌వీగి అహంకారంతో పదిమందితో గొడ‌వ‌ప‌డ‌డం మంచిదికాదు. బ‌ల‌మైన స‌ర్ప‌ము చలి చీమలకు చిక్కి మ‌ర‌ణించును.

27. మాటకు బ్రాణము సత్యము

కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్దము సుమతీ!

మనం మాట్లాడే మాటకు ప్రాణము సత్యమే, కోటకి మంచి వీరత్వం ఉన్నసైనికులే ప్రాణము. ఆడవారికి శీలమే ప్రాణము, వ్రాసిన కాగితానికి సంతకమే ప్రాణము.

28. వినదగు నెవ్వరు చెప్పిన

వినినంతనే వేగపడక వివరింపతగున్
గని కల్ల నిజము లెరిగిన
మనుజుడెపో, నీతిపరుడు మహిలో సుమతీ!

లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా… అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడు.

29. సరసము విరసము కొరకే,

పరిపూర్ణ సుఖంబు లధిక బాధలకొరకే,
పెరుగుట విరుగుట కొరకే
ధర హెచ్చుట తగ్గుకొరకే తధ్యము సుమతీ!

అతి ప‌రిహాస‌ము విరోధ‌ము తెచ్చును, అతి సుఖ‌ములు బాధ‌లు తెచ్చును. ఏదైనా అధికంగా పెరిగితే అది విరుగ‌ట ఖాయం. ధ‌ర‌లు విప‌రీత‌ములుగా పెర‌గ‌డం కూడా మ‌ళ్లీ త‌గ్గ‌డం కోస‌మే.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles