మగబిడ్డే పుడతాడని చెప్పే కొన్ని అపోహలు – వాస్తవాలు
In This Article
గర్భం ధరించడం సృష్టిలోనే అద్భుతమైన ఘట్టం. మీరు గర్భిణీ అని తెలియగానే, కుటుంబసభ్యుల ఆనందానికి అవధులుండవు. పుట్టబోయేది ఆడా, మగా అనే ఆసక్తి మొదటిరోజు నుంచే మొదలైపోతుంది. ఈ అంశం గురించి ఎన్నో అపోహలు, నమ్మకాలు వాడుకలో ఉన్నాయి.
అవన్నీ నిజానికి వైజ్ఞానికం గా నిరూపించలేనివి. ఏదో సరదాగా తెలుసుకోవాలంతే. మగపిల్లాడు పుడతాడనేందుకు ప్రజల్లో నాటుకుపోయిన కొన్ని అపోహల్ని, వాటి వెనుక ఉన్న నిజాల్ని, బిడ్డ లింగాన్ని నిర్ధారించడానికి తమాషాగా ఆడే ఆటల్ని ఇక్కడ మామ్ జంక్షన్ ప్రస్తావిస్తోంది.
పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?
బిడ్డ లింగాన్ని నిర్ధారించేది క్రోమోజోములు సంఖ్య. గర్భధారణ అంటే, స్త్రీ లోని అండం, పురుషుని లోని వీర్య కణంతో కలిసి పిండంగా మారుతుంది. పిండానికి తల్లి, తండ్రి నుంచి 23 క్రోమోజోములు సంక్రమిస్తాయి. వాటిని x ,y క్రోమోజోములు అంటారు. పిండంలో రెండు x క్రోమోజోములుంటే పిండం ఆడపిల్లగా మారుతుంది. ఒక x , ఒక y క్రోమోజోములు ఉంటే పిండం మగ పిల్లవాడిగా మారుతుంది. ఏడు వారాల గర్భం సమయం లో ఇది నిర్ధారణ అయిపోతుంది.
మగ పిల్లవాడు పుట్టబోతున్నాడని చెప్పే కొన్ని అపోహలు-నిజాలు
1. వేవిళ్లు
అపోహ: గర్భందాల్చిన సమయంలో ఎక్కువగా బాధించే సమస్య వేవిళ్ళు. వాంతులు, మత్తుగా అనిపించడం వంటి వేవిళ్ల లక్షణాలు తక్కువగా ఉంటే మగపిల్లవాడు పుడతాడని కొంతమంది నమ్మకం.
నిజం: గర్భిణులలో వేవిళ్లు చాలా సర్వ సాధారణ విషయం. దాదాపు 70-80 శాతము ఆడవాళ్ళకి వేవిళ్లు కలుగుతాయి. మొదటిసారి గర్భం ధరించిన వారిలో వేవిళ్లు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కొంతమందిలో ప్రసవం వరకూ కొనసాగుతాయి. శరీరంలోని హార్మోనల్ మార్పుల వలన వేవిళ్లు కలుగుతాయి కానీ బిడ్డ లింగాన్ని బట్టి కాదు.
2. హృదయ స్పందన రేటు
అపోహ: గర్భస్త శిశువు హృదయ స్పందన రేటు నిమిషానికి 140 సార్లు, లేదా అంతకన్నా తక్కువైతే , కడుపులో ఉన్నది అబ్బాయే అనుకుంటారు కొందరు.
నిజం: హృదయ స్పందనకి, కడుపులోని బిడ్డ లింగ నిర్ధారణకు ఎటువంటి సంబంధము లేదని ఓ అధ్యయనం చెబుతోంది. బిడ్డ ఆడయినా, మగయినా వారి గుండె నిమిషానికి 120-160 మధ్యలో కొట్టుకోవచ్చు. తల్లి వయసు ఎక్కువైతే గర్భస్థ శిశువు గుండె కొట్టుకునే రేటు 120 – 140 మధ్యలో ఉండే అవకాశం ఉంది.
3. చర్మం, జుట్టు ని బట్టి నిర్ధారణ
అపోహ: పుట్టబోయే బిడ్డ మగ పిల్లాడైతే తల్లి చర్మం నిగారింపుతో మెరిసిపోతుందని, అదే ఆడపిల్లయితే ఆమె అందం తగ్గుతుందని అంటారు. అంతేకాదు మగపిల్లాడు కడుపులో ఉంటే తల్లి జుట్టు పొడుగ్గా, చక్కగా పెరుగుతుందని ఓ నమ్మకం.
నిజం: ఈ అంశంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు దీన్ని సమర్థించట్లేదు. గర్భధారణ సమయంలో ఒక్కొక్కరి హార్మోనులు ఒక్కో రకంగా ప్రవర్తిస్తాయి. ఒక్కోసారి ఆడపిల్ల గర్భం లో ఉన్నప్పుడు తల్లి చర్మం, జుట్టు చక్కగా ఉండచ్చు. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము.
4. తిండి విషయం లో కొన్ని అపోహలు
అపోహ: పుట్టబోయేది మగపిల్లవాడైతే పుల్లని, ఉప్పని పదార్థాలు తినాలన్న కోరిక పుడుతుందంటారు.
నిజం: ఈ విషయాన్ని శాస్త్రీయంగా సమర్ధించటానికి ఎలాంటి రుజువులు లేవు. తినాలనే కోరిక బహుశా శరీరంలో ఆయా పోషకపదార్ధాల ఆవశ్యకత , కొరత మీద ఆధారపడి ఉండవచ్చు .
5. కడుపు తీరు
అపోహ: కొందరు కడుపు తీరుని చూసి పుట్టబోయేది ఆడో,మగో చెప్పేస్తారు. కడుపు కొంచెం కిందికి జారినట్టు ఉంటే మగ పిల్లాడని, లేకపోతే ఆడపిల్లని అంటారు.
నిజం: కడుపు తీరుని బట్టి లింగం నిర్ధారించటం అసాధ్యం. ఈ విషయంపై జరిగిన అధ్యయనం గురించి బర్త్ అనే జర్నల్ లో ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం కడుపు పరిమాణం, తీరుని బట్టి లింగ నిర్ధారణ కుదరదు.
6. మూడ్ లో మార్పులు
అపోహ: మగబిడ్డ కడుపులో ఉంటే మానసికస్థితిలో (Mood) ఎలాంటి మార్పులు ఉండవని ,అదే ఆడపిల్ల అయితే మూడ్ లో చాలా మార్పులు ఉంటాయని అంటారు.
నిజం: మానసికస్థితిలో మార్పులు బిడ్డ లింగాన్ని బట్టి కాదు, తల్లి శరీరంలోని హార్మోనుల మార్పుల కారణంగా వస్తాయి
7. మూత్రం రంగులో మార్పు
అపోహ: యూరిన్ రంగు కాస్త ముదురుగా ఉంటే, కడుపులో ఉన్నది మగ బిడ్డ అంటారు.
నిజం: గర్భం ధరించాక యూరిన్ రంగు మారడం సర్వ సాధారణ విషయం. ముదురు రంగులో ఉంటే బహుశా నీరు తక్కువై కూడా కావచ్చు. వేవిళ్ల కారణంగా శరీరం లో నీటి శాతం తగ్గే అవకాశం ఉంది. కనుక కడుపులోని బిడ్డ లింగ నిర్ధారణకు, యూరిన్ రంగు మార్పుకు సంబంధం లేదు.
8. రొమ్ము పరిమాణం
అపోహ: మగబిడ్డ కడుపులో ఉంటే కుడి వైపు రొమ్ము, ఎడమ వైపు రొమ్ము కంటే పెద్దగా ఉంటుంది.
నిజం: హార్మోనల్ మార్పుల వల్ల గర్భిణుల పాలిండ్లకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. పైగా బిడ్డకి పాలు సమకూర్చే పనికి శరీరం పాలిండ్లని సిద్ధం చేస్తుంది. అందువల్ల రొమ్ము పరిమాణం పెరగటం సహజమే. కడుపులో ఉన్న బిడ్డ ఆడయినా, మగయినా ఈ ప్రక్రియ జరుగుతుంది. కనుక రొమ్ముల పరిమాణం బట్టి లింగ నిర్ధారణ చేయడం అసంభవం.
9. బరువు పెరగటం
అపోహ: కడుపులో మగ బిడ్డ ఉంటే పొట్ట భాగంలో ఎక్కువ బరువు పెరుగుతారని, ఆడపిల్ల ఉంటే శరీరమంతా బరువు పెరిగి ముఖం ఉబ్బినట్టు అవుతుందని కొంతమంది అంటారు.
నిజం: గర్భం ధరించాక సాధారణంగానే బరువు పెరుగుతారు. బరువు పెరగడం అవసరం కూడా. కానీ ఈ విషయం పుట్టబోయే బిడ్డ ఆడో,మగో నిర్ధారణకు పనికిరాదు
పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణకు చేసే వైద్య పరీక్షలు
1. అల్ట్రా సౌండ్
గర్భం వయసు 18 -22 వారాల మధ్య ఉన్నప్పుడు చేసే ఒక వైద్య పరీక్ష అల్ట్రాసౌండ్ స్కాన్. పొట్ట పై భాగం నుంచే దీన్ని నిర్వహిస్తారు. బిడ్డ ఉన్న స్థితి స్కానర్ వైపు తిరిగి ఉండకపోయినా, బిడ్డ సరిగ్గా ఎదగక పోయినా ఈ టెస్టు వలన లింగ నిర్ధారణ చేయలేక పోవచ్చు.
2. గర్భస్థ శిశువు డిఎన్ఏ రక్త పరీక్ష
తల్లి రక్తంలో బిడ్డ డిఎన్ఏ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. Y క్రోమోజోముల నిర్మాణ క్రమాన్ని బట్టి బిడ్డ లింగ నిర్ధారణ చేయవచ్చు. కానీ ఈ పరీక్షకు తల్లి వయసు 35 సంవత్సరాలు దాటి ఉండాలి. బిడ్డకి ఏవైనా అవయవ నిర్మాణంలో లోపాలున్నాయేమో అనే సందేహం ఉంటేనే ఈ డిఎన్ఏ పరీక్ష చేస్తారు.
3. జెనెటిక్ పరీక్షలు
అమ్నియోసెంటెసిస్ లేదా కొరియోనిక్ విల్లి శాంప్లింగ్ పద్దతుల్లో లింగ నిర్ధారణ చెయ్యవచ్చు. గర్భస్థ శిశువు వయసు 15 వారాలు ఉన్నప్పుడు అమ్నియోసెంటెసిస్ పరీక్ష చేస్తారు. ఇది ప్రమాదమేమీ లేని పద్ధతి. కానీ ఈ పరీక్షలు పిల్లలు లోపాలతో పుట్టే చరిత్ర కలిగిన వారికి చేస్తారు. అలాగే లింగ నిర్ధారణ కూడా చేయవచ్చు.
భారత దేశం లో లింగ నిద్ధారణ పరీక్షలు చెట్ట రీత్యా నేరం. కాబట్టి మీ వైద్యులు మీ బిడ్డ ఆడ, మోగా అని మీకు చెప్పరు. మీరు కూడా వారిని అడుగకూడదు.
అబ్బాయి పుడతాడో లేదో చెప్పే తమాషా ఆటలు
బేబీ షవర్ వంటి కార్యక్రమాల్లో పుట్టబోయే బిడ్డ పాపో, బాబో చెప్పే తమాషా ఆటలు ఇక్కడ కొన్ని చెప్పుకుందాం. ఇవి కేవలం సరదాకే తప్ప, మిమ్మల్ని పాటించమని మేము చెబుతున్నట్టు కాదు.
1. ది వెడ్డింగ్ రింగ్ ట్రిక్
పెళ్లి ఉంగరాన్ని పొడవాటి తీగకి కట్టి, ఎత్తుగా ఉన్న గర్భిణీ పొట్టపై వేలాడేట్టు చేస్తారు. అది గుండ్రంగా తిరిగితే కడుపులో బాబు ఉన్నాడని అంటారు.
2. తాళంచెవిలో గుట్టు
గర్భిణి ముందు కొన్ని తాళం చెవులు పెట్టి ఒకదాన్ని ఎంచుకోమని చెబుతారు. గర్భిణి పొడుగైన తోక ఉన్న తాళం చెవి పట్టుకుంటే మగ పిల్లవాడు పుడతాడని, గుండ్రని కొస ఉన్న తాళం చెవి తీస్తే ఆడపిల్ల పుడుతుందని ప్రాచీనుల నమ్మకం.
3. చైనా దేశస్తుల చాంద్రమాన క్యాలెండరు
దాదాపు 700 ఏళ్ళ క్రితం చైనా దేశస్తులు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో నిర్ధారించే క్యాలెండరును కనిపెట్టారు. తల్లి వయసు, గర్భం ధరించిన నెలను బట్టి బిడ్డ లింగ నిర్ధారణను క్యాలెండరు ద్వారా నిర్ణయిస్తారు.
4. కాటుక పట్టడం
మన వాళ్ళు ఇత్తడి పళ్లానికి గంధం రాసి, ఆముదము దీపం మీద ఆ పళ్ళాన్ని కొన్ని గంటలు పెడతారు. మసి పట్టిన ఆ పళ్లెం పై బొడ్డు ఆకారాన్ని బట్టి ఆడో, మగో నిర్ధారిస్తారు. ఆ మసిలో పచ్చ కర్పూరం, నెయ్యి కలిపి కాటుక గా వాడుకుంటారు.
పుట్టబోయే బిడ్డ బాబో, పాపో తెలుసుకోవాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. పైన వివరించినవన్నీ తమాషాగా చెప్పుకున్నవే కానీ వైద్య పరీక్షలకు బదులుగా పాటించగలిగేవి కాదు. బాబైనా, పాపైనా తల్లితండ్రులకి ముద్దే కదా.
ప్రసవానికి ముందే బిడ్డ లింగ నిర్ధారణ చేయించడం చట్టరీత్య నేరం. మామ్ జంక్షన్ లింగ వివక్షతని సమర్ధించదు.
‘గర్భిణి గా ఉన్నప్పుడే బిడ్డ లింగ నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు’ అనే అంశంపై మీ అభిప్రాయాలేమిటో కామెంట్స్ సెక్షన్ లో తెలుపగలరు.
Community Experiences
Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.